ఆదిలాబాద్ కమలం పార్టీలో కయ్యం మొదలైంది. మున్సిపల్ ఎన్నికల ఫలితాలు ఆపార్టీని రోడ్డుకెక్కించింది. జిల్లా అధ్యక్షుడు అధికార పార్టీకి కోవర్టుగా మారి టికెట్లు అమ్ముకున్నాడని ఓవర్గం...పార్టీ పరువుని బజారుకీడుస్తున్నారని మరో వర్గం విమర్శలు, ప్రతి విమర్శలకు దిగుతున్నాయి. 

 

మున్సిపల్ ఫలితాలు ఆదిలాబాద్ జిల్లా బీజేపీలో కుమ్ములాటలను బయటపెట్టాయి. ఇన్నాళ్లు నివురుగప్పిన నిప్పులా ఉన్న కోల్డ్ వార్ ఫలితాల తర్వాత ఒక్కసారిగా రచ్చకెక్కింది. బీజేపీ జిల్లా అధ్యక్షుడు పాయల్ శంకర్ టార్గెట్‌గా ఆపార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సుహాసిని రెడ్డి వర్గం విరుచుకుపడుతోంది. 

 

మున్సిపాలిటీ ఎన్నికల్లో పాయల్ శంకర్ అధికార టీఆర్ఎస్‌తో లోపాయికారి ఒప్పందాలు చేసుకున్నాడని సుహాసిని మండిపడుతున్నారు.  ప్రజాబలం ఉన్నా..పార్టీ జిల్లా నాయకత్వం లోపంతోనే మున్సిపల్ పీఠం కోల్పోయామని అంటున్నారు. టికెట్ ఫర్ సేల్ యవ్వారంపై రాష్ట్ర్ కమిటీ నిజనిర్దారణ కమిటీ వేసి నిగ్గుతేల్చాలని డిమాండ్ చేశారు. 

 

బీజేపీకి ఆదిలాబాద్‌లో ఎంపి ఉండడంతో ...గతంతో పోల్చితే బీజేపీకి ఓటు బ్యాంక్ పెరిగింది. అయితే జిల్లా అధ్యక్షుడు సక్రమంగా లేనందువల్లే ఎక్కువ కౌన్సిలర్లు గెలుచుకోలేకపోయామని పాయల్ వ్యతిరేక వర్గం ఫైరవుతోంది. అటు పాయల్ వర్గం కూడా పార్టీకి వ్యతిరేకంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవంటూ కౌంటరిస్తోంది. 
రెండు వర్గాల మధ్య విభేదాలు ఎటువైపు దారితీస్తుందోనన్న ఆందోళనలో కమలం శ్రేణులు ఉన్నాయి. అధిష్టానం కలగజేసుకొని వివాదానికి చెక్ పెట్టాలని కోరుతున్నారు. 

 

మొత్తానికి ఆదిలాబాద్ జిల్లా రాజకీయాలు హాట్ టాపిక్ గా మారాయి. మున్సిపల్ ఎన్నికల టికెట్ల వ్యవహారంలో మొదలైన గోల.. ఎన్నికలైపోయినా కూడా చల్లారలేదు. జిల్లా నాయకులు తప్పిదం వల్ల పార్టీకి నష్టం వాటిల్లిందని పలువురు వాపోతున్నారు. ఈ వ్యవహారంతో పార్టీ రెండు వర్గాలుగా విడిపోయింది. ఒకరిపై ఒకరు విమర్శలు ఎక్కుపెట్టుకుంటూ పార్టీని బజారుకీడ్చుతున్నారు. దీనిపై అధిష్టానం కలుగజేసుకొని సర్దిపుచ్చితే తప్ప నిరసన సెగలు చల్లారేలా లేవు. 

మరింత సమాచారం తెలుసుకోండి: