తెలంగాణ ఏర్పడ్డ నాటి నుంచి.. రాష్ట్రానికి రైల్వే బడ్జెట్‌లో నిరాశే ఎదురవుతోంది. దీంతో రాష్ట్రంలో రైల్వే ప్రాజెక్టుల పనుల్లో పురోగతే కనిపించడంలేదు. కేంద్ర ప్రభుత్వం నిధుల విడుదలలో జాప్యం చేస్తుండటం, రాష్ట్ర ప్రభుత్వం భూ కేటాయింపులో నిర్లక్ష్యం వహిస్తుండటంతో.. ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టుగా ఉంది పరిస్థితి. ఈ బడ్జెట్‌లో అయినా సరిపడా నిధులు వస్తాయనే ఆశలో ఉంది తెలంగాణ సమాజం. దక్షిణ మధ్య రైల్వేకు అధిక నిధుల కేటాయించడంతో పాటు కొత్త రైళ్లు, కొత్త మార్గాలను ప్రకటిస్తారని ఎదురు చూస్తోంది. 

 

రైల్వే ప్రాజెక్టుల విషయంలో తెలంగాణ ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. బడ్జెట్‌లో నిధులు కేటాయించి, సకాలంలో విడుదల చేయకపోవడం, ప్రాజెక్టుల్లో పురోగతి లేకపోవడం, కొత్త రైల్వే మార్గాలపై దృష్టి పెట్టకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా మెదక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌- అక్కన్నపేట, మనోహరాబాద్ - కొత్తపల్లి, ఎంఎంటీఎస్ ఫేజ్ 2, ఆదిలాబాద్  -ఆర్మూర్, భద్రాచలం- సత్తుపల్లి లైన్లలో.. ఏమాత్రం పురోగతి లేదు. సుమారు 200 రైల్వే ఓవర్‌‌‌‌‌‌‌‌ బ్రిడ్జి, రైల్వే అండర్‌‌‌‌‌‌‌‌ బ్రిడ్జిల పనులు నిలిచిపోయాయి. 

 

రాష్ట్రంలోని రైల్వే ప్రాజెక్టుల విషయంలో కేంద్రం అలసత్వం ప్రదర్శిస్తోందంటూ.. తెలంగాణ రాష్ట్ర ఎంపీలు అసంతృప్తి వ్యక్తం చేస్తుండగా.. రాష్ట్ర ప్రభుత్వం తన వాటాగా ఆయా ప్రాజెక్టులకు సంబంధించిన భూసేకరణ, నిధుల కేటాయింపు పై పెద్దగా దృష్టి పెట్టడం లేదని రైల్వే వర్గాలు చెబుతున్నాయి. రాష్ట్రం వాటా నిధులు విడుదల చేయకపోవడంతో ప్రాజెక్టులు ఆగిపోతున్నాయని రైల్వే యూనియన్ నేతలు చెబుతున్నారు. కొన్నాళ్లుగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భాగస్వామ్యంతో నిర్మిస్తున్నాయి. 

 

2012-13లో 118 కోట్ల అంచనా వ్యయంతో అక్కన్నపేట-మెదక్‌‌‌‌‌‌‌‌ కొత్త లైన్‌‌‌‌‌‌‌‌ మంజూరైంది. ప్రాజెక్టు వ్యయంలో 50 శాతం భరించేందుకు తెలంగాణ ప్రభుత్వం ఒప్పుకొని, ఉచితంగా భూమి కూడా ఇచ్చింది. ప్లాన్​ ప్రకారం 2019 ఆగస్టులో ఈ లైన్‌ అందుబాటులోకి రావాల్సి ఉన్నా.. నిధుల లేమితో పనులు నిలిచిపోయాయి. రాష్ట్ర ప్రభుత్వం 105.38 కోట్ల రూపాయలు భరించాల్సి ఉండగా 21.15 కోట్లే డిపాజిట్‌‌‌‌‌‌‌‌ చేసిందని.. ఇప్పటివరకు అయిన వ్యయం ప్రకారం ఇంకా 50.41 కోట్లు డిపాజిట్‌‌‌‌‌‌‌‌ చేయాల్సి ఉందని అధికారులు చెబుతున్నారు.

 

2010-11లో 704 కోట్ల అంచనా వ్యయంతో  మంజూరైన భద్రాచలం-సత్తుపల్లి కొత్త లైను ప్రాజెక్టును... రైల్వే, సింగరేణి కలిసి సంయుక్తంగా చేపట్టాయి. భూమిని రైల్వే ఇవ్వగా, మిగతా పనులన్నీ సింగరేణి చేయాల్సి ఉంది. 619 కోట్లు సింగరేణి భరించాల్సి ఉన్నా కేవలం 156.38 కోట్లే చెల్లించింది. ఆలస్యం కావడంతో ప్రాజెక్టు వ్యయాన్ని 952 కోట్లకు పెంచారు. పనులు అంతంత మాత్రంగానే జరుగుతున్నాయి. 2016-17లో 1160 కోట్ల వ్యయంతో మంజూరైన మనోహరాబాద్‌‌‌‌‌‌‌‌- కొత్తపల్లి ప్రాజెక్ట్‌‌‌‌‌‌‌‌ పరిస్థితీ అలాగే ఉంది. మొదటి దశ పనులు గజ్వేల్‌‌‌‌‌‌‌‌ వరకు 2019 మార్చివరకే పూర్తి కావాల్సి ఉన్నా .. ముందుకు సాగడం లేదు. ఈ లైన్‌ నిర్మాణానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం 307 కోట్లు భరించాల్సి ఉన్నా.. 60 కోట్లే డిపాజిట్‌‌‌‌‌‌‌‌ చేసింది.

 

2008-09 లో మంజూరైన ఆదిలాబాద్‌‌‌‌‌‌‌‌  ఆర్మూర్‌‌‌‌‌‌‌‌ కొత్త లైన్‌‌‌‌‌‌‌‌ కోసం 2014-15లో కొత్త సర్వే చేశారు. తర్వాత పటాన్‌‌‌‌‌‌‌‌చెరు నుంచి నిర్మల్‌‌‌‌‌‌‌‌ మీదుగా ఆదిలాబాద్‌‌‌‌‌‌‌‌ వరకు రివైజ్డ్‌‌‌‌‌‌‌‌ సర్వే చేశారు. దీని ప్రకారం 4109.32 కోట్ల వ్యయం అవుతుందని తేలింది. ఈ ఫైల్‌ సీఎం కేసీఆర్‌ దగ్గర పెండింగ్‌ ఉంది. రాష్ట్ర ప్రభుత్వ వాటా చెల్లిస్తే పనులు పూర్తి అవుతాయి.. ఇది పూర్తయితే ఆదిలాబాద్‌‌‌‌‌‌‌‌ నుంచి హైదరాబాద్‌‌‌‌‌‌‌‌ మధ్య ప్రయాణ దూరం బాగా తగ్గుతుంది. 

 

2012 -13లో 817 కోట్ల అంచనాతో ఎంఎంటీఎస్‌‌‌‌‌‌‌‌ ఫేజ్‌‌‌‌‌‌‌‌2 ప్రాజెక్ట్‌‌‌‌‌‌‌‌ మంజూరైంది. ఈ పనులు ఐదున్నరేళ్లుగా కొనసాగుతున్నాయి. ఈ ప్రాజెక్టుకు రాష్ట్రం 544 కోట్లు, దక్షిణ మధ్య రైల్వే 272 కోట్లు భరించాలి. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటిదాకా 110 కోట్లు మాత్రమే విడుదల చేయగా, రైల్వే తన వంతు నిధులను పూర్తిగా ఖర్చు చేసింది. రాష్ట్ర ప్రభుత్వం ఇంకా 430 కోట్ల దాకా ఇవ్వాల్సి ఉన్నట్టు అధికారులు చెబుతున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: