నరేంద్ర మోడీ ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి వచ్చాక.. తొలి బడ్జెట్‌ ప్రవేశపెట్టబోతోంది. దేశం ముందుకు మరో భారీ బడ్జెట్‌ రాబోతోంది. పెరిగిన రైతు ఆత్మహత్యలు.. కొండెక్కిన నిత్యావసర సరుకుల ధరలు.. విపత్తులు.. ప్రకృతి ప్రకోపాలు.. కలగానే మిగిలిన గిట్టుబాటు ధరలు... ఇన్ని ఒడిదుడుకుల మధ్య మోడీ సర్కార్‌ ప్రవేశపెడుతున్న బడ్జెట్‌పై కర్షకలోకం.. భారీ ఆశలే పెట్టుకుంది.

 

వ్యవసాయ రంగానికి ప్రత్యేకబడ్జెట్‌ అనేది నామమాత్రంగా మారిపోయింది. ఏటా వ్యవసాయ కేటాయింపులు ప్రత్యేకమంటూ అంకెల గారడీ మాత్రమే కనిపిస్తోంది. రైతాంగానికి మాత్రం ఎదురుచూపులే మిగులుతున్నాయి. గతేడాది ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌తో గట్టెక్కిన మోడీ సర్కార్‌...ఈ సారైనా తమకు బడ్జెట్లో కేటాయింపులు చేయకపోతుందా? 

 

గతేడాది 27 లక్షల 86 వేల 349 కోట్లతో బడ్జెట్‌ రూపొందగా.. అందులో వ్యవసాయ బడ్జెట్‌ లక్షా 30 వేల 485 కోట్లు. రైతు రుణాల వడ్డీ మాఫీ కోసం 18 వేల కోట్లు, కిసాన్‌ సమ్మాన్‌ పథకం కోసం 75 వేల కోట్లు, పంటల భీమా కోసం 14 వేల కోట్లు కేటాయించారు. ఈ ప్రత్యేక పద్దులను మినహాయిస్తే వ్యవసాయానికి కేటాయించింది  కేవలం 27 వేల కోట్లు మాత్రమే.  అంటే, దేశవ్యాప్తంగా  సాగవుతున్న 43 కోట్ల ఎకరాలకు కేంద్రం కేటాయించింది 27 వేల కోట్లు. రాష్ట్రీయ కృషి వికాస యోజన కింద కొన్ని పథకాలను రాష్ట్రాలకు అప్పగించారు. కానీ, పంటల రక్షణ, కొత్త పంటల ప్రయోగాలు, భూసార పరీక్షలు, ప్రకృతి వైపరీత్యాల పరిహారం, యంత్రాల పెట్టుబడి వంటి పథకాలకు ఈ నిధులు ఏమాత్రం సరిపోవు. పత్తి, పసుపు, మిరప, చిరుధాన్యాలు, హార్టీకల్చర్‌ ఉత్పత్తులలో, మారుతున్న వాతావరణానికి అనుకూలంగా పరిశోధనలు చేసి నూతన విత్తనాలను సృష్టించే కార్యక్రమం చేపట్టనేలేదు.

 

కేంద్రం ఇప్పటివరకు 23 పంటలకు మాత్రమే మద్దతు ధరలు ప్రకటించింది. మిగతా పంటల విషయంలో  రైతులు దివాళా తీస్తున్నారు. మద్ధతు ధర ప్రకటించిన 23 పంటలకు కూడా ఉత్పత్తి ధరను శాస్త్రీయంగా లెక్క వేయలేదు. దీంతో ప్రతీసంవత్సరం రైతులు సుమారు 3 లక్షల కోట్ల నష్టాలు చవి చూస్తున్నట్టు ఆర్థికవేత్తలు అంచనా వేస్తున్నారు. వ్యవసాయ ఉత్పత్తి ధరల తగ్గింపు, మంచి విత్తనాల సరఫరా, కె.వి.కె ద్వారా భూసార పరీక్షలు, అందరికీ ఫసల్‌ బీమా పథకం, రైతు బీమా పథకం, ప్రకృతి వైపరీత్యాల పరిహారం చెల్లించడంతో పాటు మార్కెట్‌లో గోదాముల సౌకర్యం, కోల్డ్‌ స్టోరేజీల సౌకర్యం కల్పిస్తామని గత బడ్జెట్‌ సందర్భంగా కేంద్రం ప్రకటించినా అమలుకు మాత్రం నోచుకోలేదు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: