దేశంలోనే అతిపెద్ద రంగమైన ఆటోమొబైల్‌ రంగం తీవ్రం సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ఈ పరిస్థితుల్లో రాబోయే బడ్జెట్‌ వైపు ఆశగా చూస్తోంది. తమకోసం ఏదైనా ఆకర్షణీయమైన పాలసీని ప్రభుత్వం తీసుకొస్తుందా అని ఎదురు చూస్తోంది. ప్రభుత్వం ముందు చాలా వినతులే ఉంచింది.


దేశంలో అతలాకుతలమవుతున్న ఆటోమొబైల్‌ రంగం.. రాబోయే బడ్జెట్‌పై బోలెడన్ని ఆశలు పెట్టుకుంది. ఆటో పరిశ్రమ పుంజుకునేలా ప్రభుత్వం చర్యలు తీసుకోకపోతే.. ఇప్పట్లో కోలుకునే పరిస్థితి లేదని విన్నవించుకుంటోంది. ఆటోమొబైల్‌ రంగంలో ఆకర్షణీయమైన స్క్రాప్‌ పాలసీని తొందరగా అమల్లోకి తీసుకురావాలని కోరుకుంటోంది. ఇప్పటికే 'ది సొసైటీ ఆఫ్‌ ఇండియన్‌ ఆటోమొబైల్‌ మ్యానిఫ్యాక్చరర్‌' ప్రభుత్వానికి కొన్ని వినతులను పంపించింది. 

 

మంచి రాయితీలతో కూడిన స్క్రాపింగ్‌ పాలసీని ప్రభుత్వం ప్రకటిస్తే పాత వాహనాలను వదిలించుకొని ప్రజలు కొత్త వాహనాలవైపు మళ్లుతారు. అప్పుడు ఆటోమొబైల్‌ పరిశ్రమలో కొనుగోళ్లు పుంజుకునే అవకాశం ఉంది. ముఖ్యంగా కాలం చెల్లిన వాహనాలను తొలగించుకున్న వారికి జీఎస్టీలో 50శాతం రాయితీ, రోడ్డు పన్నులో మరో 50శాతం రాయితీ ఇవ్వాలని ఆటోరంగం కోరుతోంది. ప్రభుత్వ హయాంలోని రవాణా శాఖలు ఐసీఈ బస్సులు కొనేలా కేటాయింపులు చేయాలని కోరింది. ఫెమ్‌-2 స్కీం కింద విద్యుత్తు బస్సులు కొనేలా చూడాలని సూచించింది. ఇప్పటికే బీఎస్‌6 నిబంధనలు అమల్లోకి రానుండటంతో వాహన ధరలు పెరగనున్నాయి. ప్రభుత్వం వీటిని ప్రజలకు అందుబాటులోకి తెచ్చేందుకు జీఎస్టీ రేట్లను 28శాతం నుంచి 18శాతానికి తీసుకురావాలని పరిశ్రమ కోరుతోంది.  

 

కొన్నాళ్ల నుంచి ఆటోమొబైల్‌ రంగం కొనుగోళ్లు లేక ఇబ్బందులు ఎదుర్కొంటోంది. గత ఏడాది డిసెంబర్‌లో 16,17,398 వాహనాలు అమ్ముడవగా.. ఈ డిసెంబర్‌లో 14,05,776 వాహనాలు మాత్రమే అమ్ముడయ్యాయి. 20 ఏళ్లలో ఎన్నడూ లేనంతగా అమ్మకాలు పడిపోయాయి. ముఖ్యంగా వాణిజ్య వాహనాల విక్రయం 12శాతం తగ్గింది. మొత్తంగా వాహనాల కొనుగోలు 5.22శాతం తక్కువ అన్నమాట. ఈ ప్రభావం ఉద్యోగాలపై పడే ప్రమాదం లేకపోలేదు. 

 

ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాల్లో వాహన కొనుగోళ్లకు నాన్‌ బ్యాంకింగ్‌ ఫైనాన్స్‌ సంస్థలు అత్యధికంగా అప్పులు ఇచ్చేవి. ఇప్పుడవి కూడా తగ్గకపోవడంతో కొనుగోళ్లు పడిపోయాయి. ఈ ఏడాది నుంచి బీఎస్‌ 6 నిబంధనలు అమల్లో రానుండంటంతో చాలా మంది వాహన కొనుగోళ్లను తాత్కాలికంగా నిలిపేశారు. ఫలితంగా అమ్మకాలు మరింత పడిపోయాయి. మరోపక్క కంపెనీలు కూడా తమ సాంకేతికతను బీఎస్‌-6కు అప్‌గ్రేడ్‌ చేసుకోవాడానికి భారీగా వెచ్చించాల్సి వస్తోంది. వ్యవసాయ రంగం కూడా పెద్ద ఆశాజనకంగా లేకపోవడంతో ట్రాక్టర్ల కొనుగోళ్లు కూడా తగ్గుముఖం పట్టాయి. పెద్దపెద్ద వాహనాలు ట్రక్కులు, లారీల కొనుగోళ్లు కూడా తగ్గడంతో టాటా, లేల్యాండ్‌ సంస్థలు కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: