అమెరికా అధ్యక్ష ఎన్నికల హడావుడి మొదలైన సమయంలో ట్రంప్ భారత్ పర్యటన ఖరారైంది..! వచ్చే నెలలో మూడు రోజుల పాటు ట్రంప్ ఇండియాలో పర్యటించబోతున్నారు. దీంతో రెండు దేశాల మధ్య వాణిజ్య ఒప్పందానికి తుది మెరుగులు దిద్దతున్నారు అధికారులు. 71 వేల కోట్ల విలువైన డీల్ పై అమెరికా భారత్ సంతకాలు చేయబోతున్నాయి. 

 

 అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తొలిసారిగా భారత్‌లో అడుగుపెట్టబోతున్నారు. ఫిబ్రవరిలో ఆయన పర్యటన కోసం రెండు దేశాలు ఏర్పాట్లు చేస్తున్నాయి. ట్రంప్ పర్యటన ఎప్పుడనేది అధికారికంగా ప్రకటించకపోయినా ఫిబ్రవరి 24 నుంచి 26 మధ్యలో ట్రంప్ ఇండియా వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. రెండోసారి అమెరికా అధ్యక్ష ఎన్నికల బరిలో నిలవాలనుకుంటున్న ట్రంప్‌కు ప్రవాస భారతీయుల మద్దతు చాలా అవసరం.  అధ్యక్ష ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న సమయంలోనే ట్రంప్ భారత పర్యటనకు సిద్ధమయ్యారు.

 

ట్రంప్ పర్యటనతో రెండు దేశాల మధ్య ఉన్న చిన్న చిన్న సమస్యలు కొలిక్కి వస్తాయని భారత్ ఆశిస్తోంది. అగ్రరాజ్యంతో భారీ ఎత్తున వాణిజ్య ఒప్పందం చేసుకునేందుకు సిద్ధమయ్యింది.. పది బిలియన్ డాలర్లు...అంటే సుమారు 71 వేల కోట్లతో  రెండు దేశాల మధ్య వాణిజ్య ఒప్పందం కుదిరే అవకాశాలు ఉన్నాయి. అమెరికా చైనాల మధ్య ఇటీవల ట్రేడ్ వార్ నడిచింది. కొంతకాలం క్రితం భారత వస్తువులపైనా అమెరికా భారీగా సుంకాలను విధించింది. అయితే వాణిజ్య యుద్ధం సరికాదని భావిస్తున్న రెండు దేశాలు ట్రేడ్ డీల్ దిశగా అడుగులు వేస్తున్నాయి. 

 

మరోవైపు గతంలో రద్దు చేసిన ప్రాధాన్య వాణిజ్య హోదాను పునరుద్ధరించాలని భారత్‌ కోరుతోంది. ఈ హోదా కింద ఉన్న వస్తువులు అమెరికా మార్కెట్లలో సుంకాలు చెల్లించకుండానే ప్రవేశించే అవకాశం ఉంటుంది. భారత్‌కు చెందిన కొన్ని వస్తువులకు ఉన్న ఈ హోదాను అమెరికా కిందటి ఏడాది జూన్‌లో రద్దు చేసింది. ఆ తర్వాత అమెరికాకు చెందిన పాల, వైద్యరంగ పరికరాల ఉత్పత్తులపై భారత్‌ ఆంక్షలు విధించింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: