విజయాలకు సంబంధించిన ఫార్ములాలో ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి, తెలంగాణ సీఎం కేసీఆర్ ఒకే రూట్‌లోనే వెళుతున్నట్లు అర్ధమవుతుంది. కొన్ని కొన్ని చూస్తే అది నిజమే అనిపిస్తుంటుంది. మొదట ముందస్తు అసెంబ్లీ ఎన్నికలకు వెళ్ళి కేసీఆర్ భారీ విజయం అందుకోగా, తర్వాత ఏపీ ఎన్నికల్లో జగన్ అదిరిపోయే మెజారిటీతో గెలిచారు.  ఎన్నికల్లో వీరిద్దరు భారీ విజయాలనే సొంతం చేసుకున్నారు. అలాగే ప్రతిపక్షాలని కోలుకోలేని దెబ్బతీసి కేసీఆర్ వరుసగా...పంచాయితీ, స్థానిక సంస్థలు, మున్సిపల్ ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేసేశారు.

 

ఇటు ఏపీలో కూడా ఇప్పుడు ప్రతిపక్ష టీడీపీతో సహ మిగిలిన పార్టీల పరిస్తితి రోజురోజుకూ దిగజారిపోతుంది. జగన్ తీసుకునే అదిరిపోయే నిర్ణయాల దెబ్బకు ప్రతిపక్షాల మనుగడే ప్రశ్నార్ధకం అయిపోయింది. ఇలాంటి సమయంలోనే ఏపీలో పంచాయితీ, స్థానిక సంస్థలు, మున్సిపల్ ఎన్నికలు జరగనున్నాయి.  ఇక ఆ ఎన్నికల్లో ఎలాంటి ఫలితాలు వస్తాయో చెప్పనక్కర్లేదు. అయితే ఓ విషయంలో కూడా జగన్...కేసీఆర్ సూత్రాన్ని ఫాలో అవుతున్నారు.

 

అదేంటంటే కేసీఆర్ రాష్ట్ర అభివృద్ధి కోసం 10 జిల్లాలని కాస్త 33 జిల్లాలు చేశారు. 2018 ఎన్నికల ముందే 31 జిల్లాలు ఏర్పాటు చేశారు. ఇక తర్వాత ఇంకో రెండు జిల్లాలని ఏర్పాటు చేసి మొత్తం 33 చేశారు. ఇలా జిల్లాలని ఏర్పాటు చేయడం వల్ల ఆయా ప్రాంత ప్రజలు టీఆర్ఎస్‌కి పాజిటివ్‌గా మారిపోయారు. తమ ప్రాంతం కూడా ఓ జిల్లా అయిందనే ఆనందం వారిలో వచ్చింది. ఈ విధంగా జిల్లాలు ఏర్పాటు చేయడం వల్ల కేసీఆర్‌కు ఎదురేలేకుండా పోయింది. జగన్ కూడా 2019 ఎన్నికల్లోనే 25 పార్లమెంట్ నియోజకవర్గాలని జిల్లాలుగా చేస్తానని ప్రకటించారు. 13 జిల్లాలని కాస్త 25గా పెంచి అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు.

 

అందుకు తగ్గట్టుగానే జగన్ గెలిచారు. గెలిచాక కొత్త జిల్లాల ఏర్పాటు దిశగానే అడుగులేస్తున్నారు. అందులో భాగంగానే ఇటీవల మూడు కొత్త జిల్లాల ఏర్పాటుకు ప్రతిపాదనలు తీసుకొచ్చారు. మచిలీపట్నం, అరకు, గురజాలని జిల్లాలు చేయాలని అనుకుంటున్నారు. ఇందులో మచిలీపట్నం, అరకు పార్లమెంట్‌లు, గురజాల మాత్రం అసెంబ్లీ కాకపోతే ఇది నరసారావుపేట పార్లమెంట్ పరిధిలో ఉంటుంది. కాబట్టి ఈ మూడు జిల్లాలు ఏర్పాటు చేస్తే, మరో 9 కూడా ఏర్పాటు అయ్యే అవకాశాలున్నాయి. అది కూడా త్వరలోనే నిర్ణయం జరిగే అవకాశముంది. ఇక ఇలా 25 జిల్లాలు ఏర్పాటు అయితే జగన్‌కు ఏపీలో తిరుగుండదనే చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: