మున్సిపల్ ఎన్నికల్లో ఎక్స్ అఫిషియో సభ్యులుగా టీఆరెస్ రాజ్యసభ పక్ష నేత కేశవరావు , కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచంద్రరావు లు తమ ఓటు హక్కును వినియోగించుకోవడం వివాదాస్పదంగా మారింది .   కేవీపీ ఆంధ్ర ప్రదేశ్ కు చెందిన రాజ్యసభ సభ్యుడని టీఆరెస్ నేతలు పేర్కొంటుండగా ,  కాదు ...  కాదు  కేశవరావే ఏపీ రాజ్యసభ సభ్యుడని,  ఆయన  తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో ఎలా ఓటు వేస్తారని   కాంగ్రెస్ , బీజేపీ నేతలు ప్రశ్నిస్తున్నారు . తుక్కుగూడ మున్సిపాలిటీ లో  కేశవరావు ఎక్స్ అఫిషియో సభ్యుడిగా   దొంగ  ఓటు హక్కు వినియోగించుకున్నారని స్థానిక  బీజేపీ నేతలు మండిపడుతున్నారు .

 

ఇదే విషయమై గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ ను
కలిసి ఫిర్యాదు చేయాలని  ఆ పార్టీ  రాష్ట్ర  నాయకత్వం నిర్ణయించుకుంది . తుక్కుగూడ మున్సిపాలిటీ లో బీజేపీ కి స్పష్టమైన ఆధిక్యత లభించిందని , అయినా టీఆరెస్ నాయకత్వం ఆంధ్ర ప్రాంత రాజ్యసభ సభ్యుడు కేశవరావు తో ఎక్స్ అఫిషియో ఓటు వేయించి దొడ్డిదారిన చైర్ పర్సన్ స్థానాన్ని కైవసం చేసుకుందని కమలనాథులు ఆరోపిస్తున్నారు . ఈ వివాదం పై కేశవరావు స్పందిస్తూ తాను ఆంధ్ర ప్రదేశ్ రాజ్యసభ సభ్యుడిని కాదని పేర్కొన్నారు . కేవీపీ , తాను మాట్లాడుకుని ఆయన ఆంధ్ర ప్రదేశ్ నుంచి ప్రాతినిధ్యం వహించేలా , తాను తెలంగాణ నుంచి ప్రాతినిధ్యం వహించే విదంగా ఒప్పందం చేసుకున్నామని చెప్పారు .

 

 ఈ మేరకు ఇద్దరం  కలిసి  మంత్రి ప్రకాష్ జవదేకర్  లేఖలను ఇచ్చామని తెలిపారు . ఈ మేరకు రాజ్యసభ గెజిట్ నోటిఫికేషన్ కూడా విడుదల చేసిందని చెప్పారు . అదే నిజమైతే కేవీపీ , తాను తెలంగాణ రాజ్యసభ సభ్యుడనని చెప్పి ఎలా ఎన్నికల కమిషన్ కు ఆధారాలు  చూపి  ఓటు హక్కు సాధించుకున్నారో చెప్పాలని కాంగ్రెస్ నేతలు, కేకే ను  డిమాండ్ చేస్తున్నారు . 

మరింత సమాచారం తెలుసుకోండి: