గర్వర్నర్ లు కేంద్రానికి ప్రతినిధులు... గవర్నర్ లు రాష్ట్రంలోని పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయాలను తీసుకుంటూ ఉంటారు. గవర్నర్ లు కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీకి అనుకూలంగా నడుచుకుంటారని చాలా సందర్భాలలో పార్టీలు విమర్శలు వ్యక్తం చేస్తూ ఉంటాయి. కేరళ గవర్నర్ అరీఫ్ మహ్మద్ ఖాన్ వ్యవహరించిన తీరు మరోసారి ఈ చర్చకు దారి తీస్తోంది. 
 
ఈరోజు ఉదయం ప్రారంభమైన కేరళ బడ్జెట్ సమావేశాల్లో గవర్నర్ తన ప్రసంగాన్ని మొదలుపెట్టారు. గవర్నర్ ఏం మాట్లాడాలనే విషయాలను సాధారణంగా మంత్రివర్గం రూపొందిస్తుంది. ఇది ఏ రాష్ట్రంలోనైనా సాధారణంగా జరిగే ప్రక్రియ. మంత్రివర్గం రూపొందించిన ప్రసంగాన్ని చదువుతూ గవర్నర్ ఒక్కసారిగా చదవటం ఆపేశారు. పౌరసత్వ సవరణ చట్టం జాతీయ పౌర నమోదుకు వ్యతిరేకంగా ఉండటంతో గవర్నర్ మధ్యలోనే తన ప్రసంగాన్ని నిలిపివేశారు. 
 
గవర్నర్ మాట్లాడుతూ ఇప్పుడు తాను మాట్లాడబోయే అంశాలు వ్యక్తిగతంగా మాట్లాడే అంశాలు కావని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి చదవమని చెప్పటం వలనే తాను చదువుతున్నట్టు స్పష్టం చేశారు. తాను చెప్పే మాటలను తన అభిప్రాయంగా తీసుకోకూడదని అన్నారు. గవర్నర్ అలా చెప్పటంతో యూడీఎఫ్ సభ్యులు గవర్నర్ ప్రసంగాన్ని అడ్డుకోవటానికి పోడియంను చుట్టుముట్టారు.                                                    
 
గవర్నర్ రాజ్యాంగానికి కాకుండా మోదీ పంపించిన ధూతగా వ్యవహరిస్తున్నారని యూడీఎఫ్ సభాపక్షనేత రమేష చెన్నతల విమర్శలు చేశారు. గతంలో ఉన్న గవర్నర్ ఇలా వ్యవహరించలేదని చెప్పారు. గవర్నర్ రాజకీయాలు చేస్తున్నారని సమాఖ్య వ్యవస్థను బలహీనపరుస్తున్నారని చెప్పారు. పౌరసత్వ సవరణ చట్టం రద్దు చేయాలని కేరళ ప్రభుత్వం సుప్రీంలో పిటిషన్ దాఖలు చేయగా తన అనుమతి లేకుండా కోర్టుకు వెళ్లిందని గవర్నర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: