మాజీ మంత్రి వివేకానందరెడ్డి కుమార్తె సునీత నర్రెడ్డి వివేకా హత్య నిందితులు తననూ లక్ష్యంగా చేసుకునే అవకాశం ఉందని అన్నారు. హంతకుల నుండి తన ప్రాణాలకు, తన భర్త ప్రాణాలకు ముప్పు పొంచి ఉందని చెప్పారు. తనకూ, తన భర్త ప్రాణాలకు ముప్పు ఉందని 2019 నవంబర్ 21వ తేదీన సాయుధ రక్షణ కల్పించాలని కోరుతూ డీజీపీకి సునీత లేఖ రాశారు. ఈ లేఖకు సంబంధించిన వివరాలు ఆలస్యంగా వెలుగులోకి వచ్చాయి. 
 
రెండు రోజుల క్రితం సునీత వివేకా హత్య కేసును సీబీఐకి అప్పగించాలని కోరుతూ పిటిషన్ వేసిన విషయం తెలిసిందే. ఈ పిటిషన్ తో పాటు సునీత గతేడాది రాసిన లేఖను కూడా జతపరిచారు. లేఖలో సునీత " మార్చి 15వ తేదీ 2019 సంవత్సరం నా తండ్రి క్రూరంగా హత్యకు గురయ్యారు. నేను, నా భర్త దర్యాప్తు వేగంగా సాగడం కోసం సహకరిస్తున్నాం. అయినా హంతకుడు ఎవరో గుర్తించలేకపోయారు. నా కుటుంబం భద్రత పట్ల ఈ పరిస్థితుల్లో భయం కలుగుతోంది. నా తండ్రిని ఎవరైతే హతమార్చారో వారు మమ్మల్ని లక్ష్యంగా చేసుకునే అవకాశం ఉంది. పరమేశ్వర రెడ్డి, రంగయ్య, ప్రాణాలకు ముప్పు ఉందన్న ఆందోళన నాకు ఉంది" అని లేఖలో పేర్కొన్నారు. 
 
ఈ లేఖను సునీత స్వయంగా కడప ఎస్పీ, డీజీపీ కార్యాలయాల్లో అందజేసినట్లు సమాచారం. మరోవైపు సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ వివేకా హత్యపై అనుమానాలు ఉన్నాయని ఇంట్లో వారు చేసిన పనిగానే తాను అనుమానిస్తున్నానని చెప్పారు. జగన్ ప్రతిపక్షంలో ఉన్న సమయంలో సీబీఐ విచారణ కోరారని ఇప్పుడు ఎందుకు ఆదేశాలు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. మాజీ ఉపముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప వివేకా హత్య కేసు దర్యాప్తును సీబీఐతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. సీబీఐతో దర్యాప్తు జరిపించి నిజానిజాలను నిగ్గు తేల్చాలని సునీత కోరారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: