ఏపీ సీఎం జగన్ రాష్ట్రంలోని వాహనదారులకు ఊహించని షాక్ ఇచ్చారు. ఏపీ ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ పై అదనపు వ్యాట్ ను విధించింది. పెరిగిన చార్జీలు ఈరోజు నుండి అమలులోకి వచ్చాయి. నిన్న రెవెన్యూ విభాగం ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాష్ట్రంలోని వాహనదారులపై అదనపు భారాన్ని మోపుతూ జీవో విడుదల చేశారు. ఏపీ ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ పై లీటర్ కు 31 శాతం వ్యాట్ ను 35.20 శాతానికి, డీజిల్ పై వ్యాట్ ను 22.5 శాతం నుండి 27.5 శాతానికి పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. 
 
ప్రభుత్వం అదనపు వ్యాట్ ను విధించటం వలన లీటర్ పెట్రోల్, డీజిల్ పై 2 రూపాయల వరకు ప్రజలకు అదనపు భారం పడనుంది. కానీ ఈ ఆదేశాలలో వ్యాట్ పై అదనంగా వసూలు చేస్తున్న రెండు రూపాయలను మాత్రం వసూలు చేయవద్దని పేర్కొన్నారు. ప్రభుత్వం ఈ రెండు రూపాయలను కూడా పన్నులోనే కలిపేస్తూ తాజాగా ఆదేశాలను జారీ చేసింది. రాష్ట్రంలోని వాహనదారులు మాత్రం పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గుతున్న సమయంలో వ్యాట్ భారం పెంచడం ఏమిటని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 
 
తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, ఇతర రాష్ట్రాలలో ప్రభుత్వాలు వ్యాట్ ను తగ్గిస్తూ వాహనదారులకు మేలు చేకూరే పరిస్థితి నెలకొందని ఏపీలో మాత్రం వడ్డనలు తప్పడం లేదని వాహనదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. షెడ్యూల్ 4లో ఏపీ విలువ ఆధారిత పన్ను చట్టాన్ని సవరించి పన్ను శాతాన్ని పెంచారు. నిజానికి చంద్రబాబు అధికారంలో ఉన్న సమయంలో ఏపీలో పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా పెరిగాయి. ఎన్నికల ముందు చంద్రబాబు పెట్రోల్, డీజిల్ ధరలను రెండు రూపాయలు తగ్గించారు. 
 
అడ్డగోలుగా ప్రభుత్వం వ్యాట్ ధరలను పెంచటంతో నిత్యావసర వస్తువుల ధరలు కొండెక్కనున్నాయి. ఇప్పటికే కూరగాయల ధరలు, వంటనూనె, ఇతర నిత్యావసర వస్తువుల ధరలు భారీగా పెరుగుతున్నాయని ప్రజలు గగ్గోలు పెడుతున్నారు. ఇలాంటి తరుణంలో ఏపీలో మాత్రమే పెట్రోల్, డీజిల్ పై వ్యాట్ ను పెంచడంతో నిత్యావసర వస్తువుల ధరలు కూడా పెరిగే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది. వ్యాట్ పెంపు వలన ప్రభుత్వానికి దాదాపు 500 కోట్ల రూపాయల అదనపు రాబడి ఉంటుందని తెలుస్తోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: