ఏపీ సీఎం జగన్ కు వైసీపీ పార్టీకి చెందిన ఎమ్మెల్యే షాక్ ఇవ్వబోతున్నారా...? జగన్ నిర్ణయంతో పార్టీలోని ఎమ్మెల్యే ఏకీభవించటం లేదా...? అవసరమైతే తన ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేయనున్నారా...? అనే ప్రశ్నలకు అవుననే సమాధానం వినిపిస్తోంది. పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా దేశంలో భారీ స్థాయిలో ఆందోళనలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈశాన్య రాష్ట్రాల్లో ప్రజలు రోడ్లపైకి వచ్చి మరీ ఈ చట్టానికి వ్యతిరేకంగా ఆందోళనలు చేస్తున్నారు. 
 
పౌరసత్వ సవరణ చట్టానికి ఏపీ ప్రభుత్వం మద్దతు తెలపగా తెలంగాణ ప్రభుత్వం మాత్రం ఈ చట్టాన్ని వ్యతిరేకించింది. పార్లమెంట్ లో వైసీపీ పార్టీకి చెందిన ఎంపీలు కూడా పౌరసత్వ సవరణ చట్టం విషయంలో కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని సమర్థించారు. ఇలాంటి తరుణంలో వైసీపీ పార్టీ ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలపై వైసీపీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. వైసీపీ శ్రీశైలం ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి సీఏఏ, ఎన్‌ఆర్‌సీ చట్టాలకు వైసీపీ మద్దతు ఇవ్వటాన్ని వ్యతిరేకించారు. 
 
ముస్లింలపై వివక్ష చూపే విధంగా ఈ చట్టాలు ఉన్నాయని వైసీపీ ఈ చట్టాలకు మద్దతు ఇవ్వటాన్ని తాను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నానని శిల్పా చక్రపాణి రెడ్డి అభిప్రాయం వ్యక్తం చేశారు. నిన్న కర్నూలు జిల్లా ఆత్మకూరులోని వైసీపీ పార్టీ కార్యాలయం నుండి శిల్పా చక్రపాణి రెడ్డి మీడియాతో మాట్లాడారు. వైసీపీ పార్టీ ఎంపీలు సీఏఏ, ఎన్‌ఆర్‌సీ చట్టాలకు మద్దతు ఇవ్వటాన్ని తాను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నానని శిల్పా చక్రపాణి రెడ్డి అన్నారు. 
 
ఈ చట్టాలను అమలు చేసే క్రమంలో ముస్లింలకు ఎటువంటి ఇబ్బందులు ఎదురైనా తాను ఏ మాత్రం సహించనని శిల్పా చక్రపాణి రెడ్డి అన్నారు. అవరసరమైతే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడానికి సిద్ధమని చక్రపాణి రెడ్డి ప్రకటన చేశారు. ఈ చట్టాల గురించి సీఎం జగన్ దృష్టికి కూడా తీసుకెళ్లానని చక్రపాణి రెడ్డి అన్నారు. ఈ చట్టాల అమలు వలన ఎలాంటి నష్టం జరగదని జగన్ చెప్పారని చక్రపాణిరెడ్డి అన్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: