ఏదేశమైనా ఆర్థికాభివృద్ధి జరగాలంటే పెట్టుబడులు రావాలి. ఆర్థిక కార్యకలాపాలు పెరగాలి. అప్పుడే ప్రభుత్వానికి ఆదాయం సమకూరుతుంది. ఆ ఆదాయాన్ని మళ్లీ ప్రజల కోసమే ఖర్చు చేయగలుగుతుంది. సాధారణంగా ఈ పెట్టుబడులు మనదేశమే సొంతంగా పెట్టే పరిస్థితులు లేవు. అందుకే ఇండియా వంటి అభివృద్ధి చెందిన దేశాలు ఎక్కువగా విదేశీ సంస్థల పెట్టుబడులపై ఆధారపడతాయి.

 

ఇక విదేశీ సంస్థల విషయానికి వస్తే.. వాటికి భారత్ వంటి దేశాలు మంచి ఆదాయం పెంచుకునే మార్గాలు. తక్కువ పన్నులు, తక్కువ వేతనాలకే పనిచేసే కార్మిక శక్తి, సహజ వనరులు ఉన్న భారత్ వంటి దేశాల్లో పెట్టుబడులు పెడితే వాటికి లాభాలు కూడా బాగా వస్తాయి. అందుకే ఇది ఉభయకుశలోపరి తరహా విధానం అన్నమాట. అందుకే ప్రతి బడ్జెట్ లోనూ విదేశీ పెట్టుబడులను ఆకర్షించే ప్రయత్నాలు జరుగుతాయి.

ఇప్పుడు ఆ అవసరం ఇండియాకు చాలా ఎక్కువగా కనిపిస్తోంది. ఎందుకంటే.. 2018లో చైనా 107 బిలియన్‌ డాలర్ల విదేశీ పెట్టుబడులు ఆకర్షించగా భారత్‌ 55 బిలియన్‌ డాలర్లకే పరిమితమైంది. భారత వృద్ధిరేటు క్రమంగా తగ్గుతూ వస్తోంది. 2018-19 నాటికి కేవలం 2 శాతానికి మాత్రమే పరిమితం కావడం ఆందోళన కలిగిస్తోంది. కార్పొరేట్‌ పన్నును 30 నుంచి 22%కి తగ్గించి సులభతర వాణిజ్య ర్యాంకుల్లో భారత్‌ ప్రపంచంలో 63వ స్థానానికి ఎగబాకినా విదేశీ పెట్టుబడులు వెల్లువెత్తడంలేదు.

 

అందుకే కనీసం ఈ బ‌డ్జెట్‌లో అయినా పెట్టుబ‌డుల‌కు రెడ్ కార్పెట్ ప‌రవాల్సిన అవసరం కనిపిస్తోంది. ఓవైపు మాంద్యం ప్రభావం క్రమంగా అన్ని రంగాలకూ విస్తరిస్తున్న నేపథ్యలో విదేశీ పెట్టుబడులే కాస్త ఆశాదీపంలా కనిపిస్తున్నాయి. అందుకే ఉదారంగా పన్ను రాయితీలు, సులభతరమైన విధానాల ద్వారా విదేశీ పెట్టుబడులు ఆకర్షించేలా ఈ బడ్జెట్ ను ఎలా తీర్చిదిద్దుతారన్నది ఆసక్తికరం. మరి సీతమ్మ ఏం చేస్తారో..?

మరింత సమాచారం తెలుసుకోండి: