వరుస ఎన్నికలు తరుముతున్నాయి. వరుస పరాజయాలు వెంటాడుతున్నాయి. ప్రకటనలకు పరిమితం కావటం తప్ప, ఎన్నికలను ఎదుర్కోవడంలో మాత్రం వరుసగా విఫలమవుతోంది. గ్రేటర్ కాంగ్రెస్ పరిస్థితి రోజు రోజుకు దిశారహితంగా మారుతోందా?

 

తెలంగాణ కాంగ్రెస్ కు ఎన్నికలు పెద్ద పరీక్షగా మారిపోయాయి. వరుసగా ఓటమిపాలవ్వడంతో కాంగ్రెస్ క్యాడర్ డీలా పడిపోతోంది. ఫలితం ఎలా ఉన్నా, అసలు పార్టీకి ఎన్నికలు సన్నద్ధమయ్యే విషయంలోనే క్లారిటీ లేకుండా పోయిందనే అంశం సుస్పష్టం. అసెంబ్లీ ఎన్నికలు ముగియగానే.. పార్లమెంట్ ఎన్నికలు.. ఆ తర్వాత  మున్సిపల్ ఎన్నికలు. తరుముకొచ్చేస్తున్నాయి. ఎన్నికకు ఎన్నికకు మధ్య గ్యాప్ ఉన్నా... ఎన్నికలను ఎదుర్కోవడానికి మాత్రం విఫలమవుతోంది. జరుగుతున్న పరిణామాలు అంచనా వేస్తూ, ఎన్నికలకు దూసుకువెళ్లటంతో కాంగ్రెస్ విఫలం అవుతోంది. 

 

గ్రేటర్ మున్సిపల్ ఎన్నికలు దగ్గరకొస్తున్నాయి. గెలుపో, ఓటమో.. ఫలితం ఏదైనా ఓ ఎన్నిక కాగానే, రిలాక్స్ అయ్యే వీలు లేకుండా, ఒకదాని తరువాత మరో ఎన్నికలు వచ్చేస్తున్నాయి. దీంతో, కాంగ్రెస్ నాయకుల తీరు చూస్తే...మళ్ళీ స్టేట్‌ మెంట్ లకే పరిమితం అయ్యేలా కనిపిస్తోంది. 

 

ఓ వైపు అధికార టీఆర్ఎరెస్... ఏడాదిలో జరగనున్న గ్రేటర్ మున్సిపాలిటీ ఎన్నికలకు ఇప్పటి నుండే సిద్ధమవుతోంది. కానీ కాంగ్రెస్ పార్టీలో ఎన్నికలున్నాయనే చలనం ఏ మాత్రం లేకుండా పోతోంది. నిజం చెప్పాలంటే, గ్రేటర్ హైదరాబాద్ లో పార్టీ కి అసలు పట్టే లేకుండా పోయింది. గ్రేటర్ అధ్యక్షుడిగా దానం నాగేందర్... గ్రేటర్ మంత్రిగా ముఖేష్ గౌడ్ లు ఉన్న రోజుల్లో పార్టీ వ్యవహారాలు చురుగ్గా నడిచేవి. దానం టీఆరెస్ లోకి వెళ్లిన తర్వాత...గ్రేటర్ లో పార్టీ పడకేసింది. కనీసం సొంతగా కార్యాచరణ చేపట్టింది లేదు. పార్లమెంట్ ఎన్నికల్లో ఆశించిన పనితీరు కూడా కనిపించలేదు. ప్రస్తుతం సిటీ అధ్యక్షుడిగా ఉన్న అంజన్ కుమార్ యాదవ్ పార్టీ ని నడిపించలేక పోతున్నారా..? అనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి.

 

గ్రేటర్ ఎన్నికలు ఇంకో ఏడాది లో జరగడం ఖాయం. ఆ దిశగా అడుగులు కాదు కదా...ఆలోచన కూడా వేసే పరిస్థితిలో గ్రేటర్ కాంగ్రెస్ కనిపించటం లేదు. ఇప్పటికి పీసీసీ చీఫ్ మార్పు మీద చర్చ తప్ప, పార్టీ బలోపేతం గురించి చర్చే లేదు. గ్రేటర్ అధ్యక్షుడి పదవి కాలం ముగిసింది. కొనసాగిస్తారా..? లేదంటే కొత్త వారికి ఇస్తారా..?  అనేది కూడా తేల్చుకోలేని పరిస్థితి. అంజన్ కుమార్ యాదవ్ మాత్రం ఉన్న పదవి సంగతి పక్కనపెట్టి, వర్కింగ్ ప్రెసిడెంట్ కావాలని పైరవీ చేసుకుంటున్నారు. పరిస్థితి చూస్తుంటే, కాంగ్రెస్ అధిష్టానం కూడా తెలంగాణ ని వదిలేసిందేమో అనే కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: