భయపడిందంతా జరిగింది.. దేశంలో తొలి కరోనా వైరస్ కేసు నమోదయ్యింది. చైనా నుంచి కేరళ వచ్చిన వ్యక్తికి కరోనా వైరస్ సోకినట్టు నిర్ధారించారు. దీంతో కేరళ ప్రభుత్వం అప్రమత్తమైంది..! వైద్య ఆరోగ్య శాఖతో ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. బాధితుడికి త్రిస్సూర్‌లోని ప్రభుత్వ ఆస్పత్రిలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. కరోనా లక్షణాలు ఉన్నట్లు అనుమానిస్తున్న మరికొంతమందిని కూడా ప్రత్యేక విభాగంలో ట్రీట్‌మెంట్ ఇస్తున్నారు.

 

కొంతకాలం క్రితం జికా, నిఫా వైరస్‌లతో ఇబ్బంది పడ్డ కేరళ వాసులకు కొత్త సమస్య వచ్చి పడింది. ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాలను టెన్షన్ పెడుతున్న కరోనా వైరస్ కేసు కేరళలో నమోదయ్యింది.. మన దేశంలో నమోదయిన తొలి కరోనా వైరస్ కేసు ఇదే.. కేరళకు చెందిన కొంతమంది విద్యార్ధులు చైనాలోని కరోనా ప్రభావిత నగరం వుహాన్‌లో చదువుకుంటున్నారు. ఇటీవలే వీళ్లు కేరళ చేరుకున్నారు. కరోనా వైరస్ అనుమానంతో 20 మంది విద్యార్ధుల బ్లడ్ శాంపుల్స్‌ను పుణెలోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ వైరాలీ విభాగానికి పంపించారు. వీరిలో పది మందికి కరోనా నెగిటివ్ వచ్చింది. మిగతా పది మందిలో ఒకరికి పాజిటివ్ ఉన్నట్లు నిర్ధారించారు.

 

కరోనా వైరస్ సోకిన విద్యార్ధిని త్రిస్సూర్‌లోని ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రత్యేక వార్డులో ఉంచారు. అతనితో పాటు కరోనా లక్షణాలు ఉన్నట్లు అనుమానిస్తున్న మరికొంత మంది స్టూడెంట్స్‌ను కూడా ఐసోలేషన్ వార్డులో ఉంచారు. వీళ్ల రిపోర్ట్స్ ఇంకా కేరళ ప్రభుత్వానికి చేరలేదు. 
కరోనా వైరస్ వేగంగా విస్తరించే ప్రమాదం ఉండటంతో కేరళ ప్రభుత్వం అన్ని జాగ్రత్తలు తీసుకుంటోంది. విదేశాల నుంచి ముఖ్యంగా చైనా నుంచి వచ్చిన వారిని ఇళ్లకే పరిమితం కావాలని ఆదేశించింది. దాదాపు 800 మంది కేరళ వాసుల కదలికలపై ప్రభుత్వ ఆంక్షలు విధించింది. వీళ్లంతా ఇటీవల కాలంలో చైనాను సందర్శించిన వాళ్లే.  ముందు జాగ్రత్తగా కేరళలోని అన్ని జిల్లా ఆస్పత్రుల్లో ప్రత్యేక కరోనా వార్డులను ఏర్పాటు చేశారు...వైద్య ఆరోగ్య శాఖతో ముఖ్యమంత్రి ఎప్పటి కప్పుడు సమీక్ష నిర్వహిస్తున్నారు. అటు కేంద్ర ప్రభుత్వం కూడా కేరళకు ప్రత్యేక బృందాలు పంపుతోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: