తెలంగాణ కాంగ్రెస్ కి  కొత్త చీఫ్ వస్తాడంటూనే నెలలు గడుస్తున్నాయి. కానీ, ఎవర్ని, ఎప్పుడు నియమిస్తారో స్పష్టత రావటంలేదు. కొత్త పీసీసీ చీఫ్ కి ముహూర్తం ఎప్పుడు? అధిష్టానం తాత్సారం చేయటానికి కారణాలేంటి? సీడబ్యూసీ సమావేశం తర్వాత పీపీసీ చీఫ్ ని తేలుస్తారా? 

 

తెలంగాణ చీఫ్ నియామకానికి ముహూర్తం ఖరారైందా..? వాయిదాలు వేయడం వెనక అధిష్టానం ఆలోచన ఏంటి..?  తెలంగాణలో కాంగ్రెస్ కి  కొత్త చీఫ్ రావడం అనేది పక్కా. ఇందులో సందేహం లేదు. కానీ ఎప్పుడు అనేది మాత్రం ఇంకా క్లారిటీ రావటం లేదు. అదిగో..అదిగో అంటూ నాలుగు నెలలు గడిచింది. కానీ ఇంకా ఎలాంటి స్పష్టత రాలేదు. పీసీసీ చీఫ్ గా కొనసాగడానికి ఉత్తమ్ సుముఖంగా లేకపోవడంతో కొత్త అధినేత కోసం అధిష్టానం దృష్టి పెట్టింది. మున్సిపల్ ఎన్నికలు ముగిసిన వెంటనే భర్తీ చేస్తారనే ప్రచారం సాగింది. కానీ.. అంతా ఇప్పుడు సైలెంట్ అయ్యారు. ముహూర్తం ఫిబ్రవరి 15 కి మారింది. 

 

ప్రస్తుతం ఢిల్లీలో ఎన్నికలు ఉన్న నేపథ్యంలో తెలంగాణ నుండి 15 మంది నాయకులను ఎన్నికల ప్రచారానికి పిలిచింది అధిష్టానం. ఢిల్లీ ఎన్నికల హడావుడి పూర్తి అయితే... కాంగ్రెస్ నాయకత్వానికి వెసులుబాటు దొరికే అవకాశం ఉంటుంది. ఆ  తర్వాత పార్టీ నిర్మాణం మీద దృష్టి పెడతారనే ప్రచారం నడుస్తోంది. 


 
ఢిల్లీ ఎన్నికల తర్వాత... ఫిబ్రవరి రెండో వారంలో రాజస్థాన్ లో కాంగ్రెస్ సీడబ్ల్యూసీ సమావేశం నిర్వహించ బోతుంది. ఈ సమావేశంలో ఏఐసీసీ ప్రక్షాళన, పార్టీ నిర్మాణం మీదే ప్రధానంగా చర్చ చేసే అవకాశాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో సీడబ్ల్యూసీ సమావేశ నిర్ణయాల తరువాత రాష్ట్రాల్లో పార్టీ నిర్మాణంపై దృష్టి పెట్టబోతున్నారని తెలుస్తోంది. తిరిగి రాహుల్ గాంధీకి పార్టీ పగ్గాలు అప్పగించే క్రమంలోనే రాష్ట్రాల కు పార్టీ చీఫ్ ల నియామకం ఉండేలా ప్లాన్ చేస్తున్నట్టు టాక్ నడుస్తోంది. దీంతో, ఫిబ్రవరి రెండు మూడు వారాల్లో, టీ కాంగ్రెస్ చీఫ్ తెలుస్తుందనే ప్రచారం జరుగుతోంది.

 

మరోపక్క తెలంగాణ కాంగ్రెస్ కీలక నేతల్లో పిసిసి చీఫ్ పదవి ఎవరిని వరిస్తుందో అనే విషయం కూడా చర్చనీయాంశంగా మారింది. అసెంబ్లీ, పార్లమెంట్ లో ఓ మోస్తరు ఫలితాలను సాధించిన కాంగ్రెస్  ఆ తర్వాత జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో పూర్తిగా వెనుక పడింది. తెలంగాణలోని 32  జిల్లా పరిషత్ స్థానాల్లో ఒకటి కూడా కాంగ్రెస్ పార్టీ దక్కించుకోలేకపోయింది. తాజాగా జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో ఆ పార్టీ ఊహించిన కంటే తక్కువగానే  స్థానాలు వచ్చాయి. దక్షిణ తెలంగాణ జిల్లాలు మినహాయిస్తే ఇతర తెలంగాణ జిల్లాల్లో ఆ పార్టీకి పెద్దగా స్థానాలు కూడా దక్కలేదు. నగర శివారు తో పాటు నల్గొండ, మహబూబ్ నగర్ జిల్లాల్లో కొద్దిపాటి స్థానాలను గెలుచుకుని కాంగ్రెస్ తన ఉనికిని చాటుకుంది.  ఈ పరిస్థితుల్లో కొత్తగా వచ్చే టీపీసీసీ చీఫ్ పార్టీని ముందుకు నడిపించడం ఓ పెద్ద సవాల్ గా మారబోతోంది. పీసీసీ చీఫ్ రేస్ లో పది మంది పేర్లు చర్చలో ఉన్నా వారిలో ఎవరిని పదవి వరిస్తుందనేది ఉత్కంఠ రేపుతోంది ఎంపీలు కోమటిరెడ్డి, రేవంత్ రెడ్డి లతో పాటు మాజీ ఎంపీలు పొన్నం, విహెచ్ ల తో పాటు మాజీ మంత్రి శ్రీధర్ బాబు పేరు  ప్రముఖంగా వినిపిస్తోంది.  

మరింత సమాచారం తెలుసుకోండి: