జనసేన పార్టీకి రాజీనామా చేస్తూ మాజీ సీబీఐ మాజీ  జీడీ వీవీ లక్ష్మీనారాయణ సంచలన నిర్ణయం తీసుకున్నారు. గత కొంతకాలం నుంచి పార్టీపైన, అధినేత పవన్ కళ్యాణ్ పైన గుర్రుగా ఉంటూ వస్తున్న ఆయన పార్టీ మారతారని, బీజేపీలో చేరతారని పెద్దఎత్తున ప్రచారం జరిగింది. అయితే ఆయన మాత్రం సైలెంట్ గానే ఉంటూ సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటూ వస్తున్నారు. కానీ .. ఎక్కడా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గురించి విమర్శలు చేయకుండా.. తాను సొంతంగా ఈ కార్యక్రమాలు చేస్తున్నారు. పవన్ చేపడుతున్న వివిధ ఆందోళన ఆయన హాజరు కావడం లేదు. అలాగే ఇటీవల జనసేన పార్టీ బీజేపీతో పొత్తు పెట్టుకున్న విషయంలోనూ  జేడీ ఆగ్రహంగా ఉన్నారు.


 తనకు కనీసం ఈ విషయం చెప్పకుండా పొత్తు పెట్టుకున్నారని ఆయన తన సన్నిహితుల దగ్గర ఆవేదన వ్యక్తం చేసినట్టు వార్తలు కూడా కొద్ది రోజులుగా వస్తున్నాయి.  అది కాకుండా పవన్ లో రాజకీయ నాయకుడి లక్షణాలు లేవని, ఆయన నిత్యం రకరకాల వ్యాఖ్యలు చేస్తూ టిడిపికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారు అనే భావనలో ఉంటూ వచ్చారు. అదీ కాకుండా జనసేన పార్టీని స్థాపించిన తరువాత తాను ఇక సినిమాల్లో నటించను అని, పూర్తి సమయం రాజకీయాలకే కేటాయిస్తానని చెప్పారని, కానీ ఇప్పుడు పింక్ రీమేక్ సినిమాలో నటిస్తుండడం, పార్ట్ టైం పాలిటిక్స్ చేస్తుండడం తనకు ఆగ్రహం తెప్పించిందని  తన సన్నిహితుల దగ్గర జేడీ బాదపడ్డారట. 


ఇక జనసేన పార్టీ కూడా రాజకీయంగా తప్పటడుగులు వేస్తూ... అనుమానాస్పదంగా వ్యవహరిస్తుండడం ప్రజల్లో ఆ పార్టీపై పెద్దగా నమ్మకం లేకపోవడంతో తన లాంటి వ్యక్తులు ఆ పార్టీలో ఇక ఇమడలేరనే ఒక అభిప్రాయానికి వచ్చిన లక్ష్మి నారాయణ పార్టీకి రాజీనామా చేస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు రాజీనామా పత్రాన్ని అధినేత పవన్ కళ్యాణ్ కు పంపించారు. జేడీ రాజీనామా తో రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపుతోంది. జేడీ వంటి నిజాయితీపరులైన నాయకులు కూడా ఆ పార్టీకి దూరమైతే జనసేన ఉనికికే ప్రమాదం ఏర్పడుతుందని పలువురు అభిప్రాయపడుతున్నారు.


 ఇప్పుడు జనసేన కు రాజీనామా చేయడంతో ఆయన రాజకీయ భవిష్యత్ ఏంటి అనేది ప్రశ్నార్థకంగా మారింది. ఆయన బీజేపీలో చేరతారని వార్తలు వస్తున్నా ... బిజెపి జనసేన పొత్తు పెట్టుకున్న నేపథ్యంలో ఆయన ఏ విధంగా ముందుకు వెళతారు అనేది ఆసక్తిగా మారింది. దీనిపై ఆయన స్పందించి తాను ఎందుకు రాజీనామా చేయాల్సి వచ్చిందో...  తాను ఏ పార్టీలో చేరుతున్నాను అనేది చెబితేగాని ఈ సస్పెన్స్ కు తెర పడదు.

మరింత సమాచారం తెలుసుకోండి: