ప్రస్తుతం ఏపీలో రాజకీయాలు మూడు రాజధానులు, మండలి రద్దు, అమరావతి వ్యవహారాలపైనే తిరుగుతున్నాయి. ఈ అంశాలు ఎప్పుడు తెరమరుగవుతాయో ఎవరికి అర్ధం కాకుండా ఉంది. అయితే ఇవి ఇలా నడుస్తుండగానే స్థానిక సంస్థల ఎన్నికలు వస్తే ఫలితాలు ఎలా ఉంటాయనే ఆసక్తి ప్రజల్లో నెలకొంది. ఇక ప్రజలతో పాటు పార్టీలు కూడా ఎవరి అంచనాల్లో వారు మునిగిపోయారు. తమ పార్టీకి మూడు రాజధానుల అంశం కలిసొస్తుందని మొత్తం తామే క్లీన్ స్వీప్ చేస్తామని అధికార వైసీపీ ధీమాగా ఉంది.

 

కానీ టీడీపీ మాత్రం ఇంత ధీమాలో లేదు. 2019 ఎన్నికలు ఎఫెక్ట్ కారణంగా పార్టీ మెజారిటీ స్థానాలు గెలుచుకోవడం కష్టమే అని భావిస్తుంది. కాకపోతే అమరావతి అంశం తమకు మేలు చేస్తుందనే భావనలో ఉన్నారు. ఉత్తరాంధ్ర, రాయలసీమలు వదిలేసిన కోస్తా జిల్లాలో తమ ప్రభావం ఉంటుందని భావిస్తుంది. ముఖ్యంగా అమరావతికి అటు ఇటు ఉన్న కృష్ణా, గుంటూరు జిల్లాలో అత్యధిక సీట్లు సాధించడంతో పాటు, రెండు జెడ్పీ స్థానాలని కైవసం చేసుకుంటామని టీడీపీ శ్రేణులు ఫుల్ కాన్ఫిడెన్స్‌తో ఉన్నాయి.

 

ఈ మేరకు కృష్ణా, గుంటూరు జిల్లా టీడీపీ శ్రేణులు అంచనాలు వేసుకుంటున్నాయి. ఈ రెండు జిల్లాలోనూ వైసీపీపై నెగిటివ్ పెరిగిందని, అమరావతిని తరలించడం రెండు జిల్లాల ప్రజలకు ఇష్టం లేదని, కాబట్టి ఈ రెండు జిల్లాల వారు తమవైపే మొగ్గుచూపుతారని ఆశలు పెట్టుకున్నారు. ఇదే సమయంలో ఈ రెండు జిల్లాల టీడీపీ కార్యకర్తల్లో ఉన్న కాన్ఫిడెన్స్ వైసీపీ శ్రేణుల్లో కాస్త తక్కువగానే ఉందనే టాక్ కూడా వస్తుంది. 

 

కాకపోతే అధికారంలో ఉన్నాం కాబట్టి ఎలాంటి ఇబ్బంది ఉండదని, ఈ రెండు జిల్లాలని కూడా గెలుచుకుంటామని అంటున్నారు. మరి చూడాలి ప్రస్తుతం కోర్టు పరిధిలో ఉన్న స్థానిక సంస్థల ఎన్నికల అంశం ఎప్పుడు క్లియర్ అవుతుందో? ఎప్పుడు ఎన్నికలు జరుగుతాయో? ఇక ఆ ఎన్నికల్లో కృష్ణా, గుంటూరు జెడ్పీలని టీడీపీ గెలుచుకోగలదో? లేదో?

మరింత సమాచారం తెలుసుకోండి: