పారిశ్రామీకరణతో పాటు వేగంగా అభివృద్ధి చెందడమంటే... ఆరోగ్యాన్ని పణంగా పెట్టడమే అనేలా తయారయింది నెల్లూరు పరిస్థితి. నగరం వేగంగా విస్తరించడంతో , కాలుష్యం దెబ్బకు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు పట్టణ వాసులు. ఓ వైపు వాహన కాలుష్యం.... మరో వైపు, పారిశ్రామిక వ్యర్ధాలతో  కాలుష్యకాసారంలా మారింది సింహపురి.

 

పారిశ్రామీకరణ ప్రజలకు ఉపాధి కల్పిస్తుంది. కానీ పరిశ్రమల నుంచి వెలువడే కాలుష్యాన్ని సురక్షిత పద్ధతుల్లో మళ్లించే వ్యవస్థలు ఏర్పాటు చేసుకోకపోతే అదే శాపంగా మారుతుంది. నెల్లూరు నగరం చుట్టుపక్కల కొన్ని కర్మాగారాలు వ్యర్థాలను శుద్ధి చేయకుండానే నీటి వనరుల్లోకి యథేచ్ఛగా వదిలేస్తున్నాయి. విష వాయువులను గాలిలోకి వదులుతున్నాయి. వాటి ప్రభావానికి ప్రజలు వ్యాధుల బారిన పడుతున్నారు.

 

నెల్లూరు నగరం 150 చదరపు కిలోమీటర్ల పరిధిలో విస్తరించి ఉంది. 54 డివిజన్లలో దాదాపు 8 లక్షల మంది జనాభా నివసిస్తున్నారు. చుట్టుపక్కల 250 రైసుమిల్లులతో పాటు ఇతర పరిశ్రమలు నెలకొన్నాయి. అంతవరకు బాగానే ఉన్నా.. కొందరు నిబంధనలకు విరుద్ధంగా పరిశ్రమలను నడుపుతుండటంతో జనం తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. వాటిని నిరోధించాల్సిన కాలుష్య నియంత్రణ మండలి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి.  నగరంలో వాయు కాలుష్యంతో శ్వాసకోశ వ్యాధులతో బాధపడే వారి సంఖ్య పెరుగుతోంది. 

 

భూగర్భ మురుగునీటి, తాగునీటి పథకం పనుల్లో భాగంగా 600 కిలోమీటర్లకు పైగా రోడ్లను ధ్వంసం చేశారు. వాటిలో సగం రోడ్లను పునర్‌ర్నించగా మిగతా రోడ్లన్నీ అలాగే ఉన్నాయి. ఈ రోడ్లపై వెళ్లే వారికి దుమ్ము, ధూళితో పాటు... వాహనాల నుండి వెలవుడే పొల్యూషన్‌ తీవ్ర ఇబ్బంది పెడుతున్నాయి. దీనికి తోడు థర్మల్ విద్యుత్ ప్రాజెక్టుల కాలుష్యం నగరవాసులను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. 

 

నగర సుందరీకరణ, ఆధునిక జీవన విధానంలో పెరుగుతున్న వస్తు వినియోగంతో వ్యర్థాలు పెరుగుతున్నాయి. ఎక్కువగా ఘన వ్యర్థాలను రీసైక్లింగ్‌కు పంపించకుండా డంపింగ్‌ యార్డుల్లో పడేస్తున్నారు. అక్కడే నిప్పంటిస్తున్నారు. దీంతో నగరం చుట్టూ కాలుష్యం పెరుగుతోంది. పొడి, తడి చెత్తలను వేరుచేసే విధానంపై ప్రజల్లో అవగాహన కొరవడింది. ఈ కారణంగా వ్యర్థాలతో అనేక అనర్థాలు ఏర్పడుతున్నాయి. 

 

నగరం చుట్టూ ఉన్న 250కిపైగా వున్న రైస్ మిల్లులతో పాటు... ఇంధన, పామాయిల్ పరిశ్రమలతో  వచ్చే వేడి గాలులతో నగర స్వరూపం మారిపోతోంది. ఇందుకు తగ్గట్టుగా మొక్కలు పెంచడంలో విఫలం కావడం వల్లే, వాతావరణం మారిపోయిందని పట్టణవాసులు అంటున్నారు. కాలుష్యాన్ని నియంత్రించి, రోగాల బారి నుండి కాపాడాలని పట్టణ ప్రజలు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: