తెలంగాణలో ఇప్పుడప్పుడే ముఖ్యమంత్రి పదవి మార్పిడి ఉండబోదని ముఖ్యమంత్రి కేసీఆర్ , మంత్రి కేటీఆర్ తేల్చి చెబుతున్నప్పటికీ , కేబినెట్ మంత్రులు మాత్రం కేటీఆర్ కు ముఖ్యమంత్రి పీఠాన్ని కట్టబెట్టాల్సిందే నని తమ వ్యాఖ్యల ద్వారా  పరోక్షంగా ఒత్తిడి చేస్తున్నారు . ఇప్పటికే పలువురు మంత్రులు ... ముఖ్యమంత్రి పదవికి కేటీఆర్ అన్ని విధాలుగా అర్హుడని , భవిష్యత్తు సీఎం కేటీఆర్ అంటూ పేర్కొన్న విషయం తెల్సిందే . గురువారం తెలంగాణ భవన్ లో జరిగిన ఒక కార్యక్రమం లో మంత్రి కేటీఆర్ సమక్షం లోనే మరొక మంత్రి గంగుల కమలాకర్ , కేటీఆర్ పట్ల తనకున్న విధేయతను చాటుకున్నారు.  

 

దేశం అంత కేసీఆర్ ప్రధాని కావాలని కోరుకుంటుందని ..దేశం అభివృద్ధి చెందాలంటే కేసీఆర్ ప్రధాని కావాలన్న ఆయన  ,  రాష్ట్రానికి కేటీఆర్ ను  సీఎం చేయాలని సెలవిచ్చారు  .కేటీఆర్ తండ్రికి తగ్గ తనయుడిగా పేరు తెచ్చుకున్నారని ... కేటీఆర్ పనితీరు వల్ల మున్సిపల్ ఎన్నికల్లో టీఆరెస్  భారీ విజయాన్ని నమోదు చేసుకుందని అన్నారు . స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇలాంటి ఎన్నికల ఫలితాలు రాలేదని , సీఎం కేసీఆర్- మంత్రి కేటీఆర్ పనితీరు చరిత్రలో నిలిచిపోతుందన్నారు . తెలంగాణ రాష్ట్రం టీఆరెస్ ప్రభుత్వం సింగిల్ లీడర్ షిప్ వల్ల అనుకూల ఫలితాలు వచ్చాయని కమలాకర్ వెల్లడించారు .

 

తెలంగాణ లో మున్సిపల్ ఎన్నికలు ముగిసిన తరువాత కేటీఆర్ ను సీఎం పీఠం పై ముఖ్యమంత్రి కేసీఆర్ కూర్చబెట్టడం ఖాయమని ఎన్నికలకు ముందు ఊహాగానాలు వినిపించిన విషయం తెల్సిందే . ఎన్నికల ఫలితాలు వెలువడిన తరువాత కేసీఆర్ మీడియా తో మాట్లాడుతూ తన ఆరోగ్యం బాగానే ఉందని , తానే మరికొన్నాళ్లు సీఎం కొనసాగుతానని స్పష్టం చేశారు . అయినా మంత్రుల తీరు మాత్రం మారడం లేదు .. కేటీఆర్ భవిష్యత్తు సీఎం అంటూ తమ స్వామి భక్తి చాటుకుంటున్నారు . 

మరింత సమాచారం తెలుసుకోండి: