ఈ మధ్య కాలంలో సైబర్ నేరాల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతున్న విషయం తెలిసిందే. టెక్నాలజీని అందిపుచ్చుకుని మోసాలు చేసే వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ఆన్ లైన్ లావాదేవీలు, డిజిటల్ లావాదేవీలు పెరగటంతో సైబర్ నేరగాళ్లు కూడా ఈ లావాదేవీలను దృష్టిలో పెట్టుకొని మోసాలకు పాల్పడుతున్నారు. ఎవరైనా సోషల్ మీడియాలో, ఆన్ లైన్ లో వివరాలను ఉంచితే చాలు ఏదో రకంగా మోసాలకు పాల్పడి ఖాతాలలోని డబ్బును లూటీ చేస్తున్నారు. 
 
చాలామంది బాధితులు ఇలాంటి కేసుల్లో సత్వరం స్పందించటం లేదు. బాధితులు సత్వరం స్పందిస్తే 100కి 99 శాతం డబ్బులు ఖాతాలో తిరిగి చేరే అవకాశాలు ఉంటాయి. మోసపోయిన చాలామంది బాధితులు ఫిర్యాదు చేయడానికి వెనుకడుగు వేస్తూ ఉంటారు. మోసానికి గురైన బాధితులు వెంటనే బ్యాంకు అధికారులను కలిసి లావాదేవీల జాబితాను తీసుకొని సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయాలి. 
 
సైబర్ క్రైమ్ పోలీసులు ఫిర్యాదు అందిన వెంటనే బాధితుని ఖాతాలో సొమ్ము చేరే విధంగా చర్యలు చేపడతారు. బీహార్, జార్ఖండ్, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ, ముంబై కేంద్రాలుగా ఇలాంటి మోసాలు ఎక్కువగా జరుగుతున్నాయి. సకాలంలో ఫిర్యాదు చేసిన వారిలో ఎక్కువ మందికి ఖాతాలలో నగదు జమైంది. గతంలో ఎక్కువగా డెబిట్ కార్డు క్లోనింగ్ కు పాల్పడి సైబర్ నేరాలు చేసేవారు ఇప్పుడు రెన్యూవల్ చేయాలనో, అప్ డేట్ చేయాలనో చెబుతూ బాధితుల ఖాతాల నుండి డబ్బులు కాజేస్తున్నారు. 
 
ఖాతాదారులు ఎల్లప్పుడూ ఫోన్ కాల్స్ ద్వారా అవతలి వారి మాటలను నమ్మి మన ఖాతాల, ఏటీఎం, యూపీఐ, వివరాలను పంచుకోకూడదు. అపరిచిత వ్యక్తులు చెప్పిన మాటలు నమ్మి ఫోన్ లో ఎలాంటి వివరాలను చెప్పినా మోసపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఎవరైనా బ్యాంక్ ప్రతినిధులు అని చెప్పి కాల్ చేస్తే డైరెక్ట్ గా బ్యాంకుకు వెళ్లి సమస్యను పరిష్కరించుకోవడం ఉత్తమం. సైబర్ నేరగాళ్ల బారిన పడి మోసపోతే మాత్రం వెంటనే ఫిర్యాదు చేస్తే సమస్యకు తప్పనిసరిగా పరిష్కారం లభిస్తుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: