విజ‌య‌వాడ మెట్రో ప్రాజెక్టులను నిర్మించే విషయంలో ఆంధ్రప్రదేశ్ అనాసక్తి చూపినట్లు తెలుస్తోంది. నవ్యాంధ్ర రాజధానికి అత్యంత ప్రతిష్ఠాత్మకమైన మెట్రో రైల్‌ ప్రాజెక్టు భవితవ్యంపై స్ప‌ష్ట‌మైన క్లారిటీ రావ‌డం లేద‌న్నది వాస్త‌వం. రాజధాని ప్రాంతంగా శరవేగంగా అభివృద్ధి చెందుతున్న విజయ వాడకు మెట్రో రైలును తీసుకురావాలని మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత‌ నారా చంద్ర‌బాబు భావించారు. అప్పటికే హైదరాబాద్ లో మెట్రో పరుగులు తీస్తోంది. దీంతో విభజన హామీల ప్రకారం ఏపీకి కూడా మెట్రో కేటాయించారు. కానీ ఆప్రాజెక్టు ఇంకా మీనమేషాలు లెక్కించే దశలోనే ఉంది.

 

గత టీడీపీ ప్రభుత్వం హయాంలో విశాఖ, విజయవాడ నగరాల్లో మెట్రో రైలు ప్రాజెక్టుపై గత సీఎం చంద్రబాబు అనేకసార్లు ప్రకటనలు చేశారు.  అదే సమయంలో  ఈప్రాజెక్టుకు  కేంద్రం కూడా హామీ ఇచ్చింది. ఆ త‌ర్వాత మీడియం మెట్రో వచ్చేసిందన్నారు. భూసేకరణకు డ్రాఫ్ట్‌ నోటిఫికేషన్‌ కూడా జారీ చేశారు. అది కాస్తా రద్దయింది. లైట్‌ మెట్రో అన్నారు. దీనికి డీపీఆర్‌ సిద్ధమవుతోందంటున్నారు. మధ్యలో మూడేళ్లు గడిచిపోయాయి. మీడియం మెట్రో కోసం సేకరించాలని ప్రతిపాదించిన భూములపై ప్రభుత్వం ఆంక్షలు విధించింది.  

 

అయితే  రాష్ట్ర విభజన చట్టం నిర్దేశించిన మేరకు ఏర్పాటు చేయాల్సిన మెట్రో ప్రాజెక్టుకు సంబంధించి నూతన ప్రభుత్వ వైఖరి ఎలా ఉంటుందన్నది చర్చనీయాంశంగా మారింది. ఇక‌ అందుతున్న స‌మాచారం ప్ర‌కారం.. అమ‌రావ‌తిని రాజ‌ధానిగా ప్ర‌క‌టించిన త‌ర్వాత అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా తెర‌మీదికి వ‌చ్చిన కీల‌క ప్రాజెక్టు విజ‌య‌వాడ మెట్రో.  అయితే, ఇప్పుడు రాజ‌ధానులు మూడ‌నే నేప‌థ్యంలో విజ‌య‌వాడ మెట్రోకు ప్రాధాన్యం త‌గ్గింద‌నే భావ‌న వ‌స్తోంది. అలాగే  విజ‌య‌వాడ మెట్రో ప్రాజెక్టుకు కేంద్రం నిధులు కేటాయించ‌లేదు. ఈ బ‌డ్జెట్‌లో అయినా నిధులు కేటాయించాల‌ని ప్ర‌భుత్వం గ‌తంలో కోరింది. ఈ క్ర‌మంలో కేంద్రం త‌న బ‌డ్జెట్లో విజ‌య‌వాడ మెట్రోకు ఏమేర‌కు నిధులు ఇస్తుందో.. విజ‌య‌వాడ మెట్రో క‌ల ఎప్ప‌టికి నెర‌వేరుతుందో చూడాలి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: