ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా పదవీబాధ్యతలు స్వీకరించిన రోజు నుండి సీఎం జగన్ ప్రజలకు మేలు చేకూరేలా నిర్ణయాలు తీసుకుంటున్న విషయం తెలిసిందే. తాజాగా సీఎం జగన్ సూచనల మేరకు విద్యాశాఖ రాష్ట్రంలోని ఇంజనీరింగ్ కాలేజీలలో ఫీజులను తగ్గించటం కొరకు చర్యలు చేపట్టింది. ఉన్నత విద్యా నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్ ఛైర్మన్ జస్టిస్ ఈశ్వరయ్య ఫీజుల కోసం కేవలం విద్య కోసం ఖర్చు చేసే వ్యయాన్ని మాత్రమే పరిగణనలోకి తీసుకుంటామని స్పష్టం చేశారు. 
 
ప్రభుత్వానికి విద్యాశాఖ ఫిబ్రవరి నెల రెండో వారంలో ఫీజులకు సంబంధించిన నివేదికను అందజేయనుంది. జస్టిస్ ఈశ్వరయ్య మాట్లాడుతూ కాలేజీలలో ఉండే వసతులు, సౌకర్యాలు, ప్రమాణాల ఆధారంగా కాలేజీలకు ఫీజులను నిర్ణయిస్తామని అన్నారు. మెడికల్, ఫార్మా కాలేజీలలో కూడా బృందాలు తనిఖీలు చేస్తున్నాయని మెడికల్, ఫార్మా కాలేజీలలో ఫీజుల విధానం గురించి త్వరలోనే నిర్ణయం తీసుకోబోతున్నామని చెప్పారు. 
 
ఇంజనీరింగ్ కాలేజీల ఫీజులు మాత్రం ఫిబ్రవరి 4వ తేదీ వరకు కాలేజీల వాదనలు కూడా విని పది రోజుల తరువాత ఫీజులకు సంబంధించిన వివరాలను ప్రకటిస్తామని చెప్పారు. ఉన్నత విద్యా నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్ ఇంజనీరింగ్, మెడికల్, ఫార్మాలతో పాటు యూజీ, పీజీ, ఫిజికల్ ఎడ్యుకేషన్ కోర్సులు, లా కోర్సులు, డిగ్రీ కోర్సుల ఫీజులను కూడా ఖరారు చేయనుంది. 
 
అన్ని కాలేజీలు తమ ఫీజులకు సంబంధించిన పట్టికలను ఫిబ్రవరి నెల 10వ తేదీలోపు వెబ్ సైట్ లో అప్ లోడ్ చేయాల్సి ఉంటుంది. పీజీ, డిగ్రీ కోర్సులకు కూడా ఒకే రకమైన ఫీజులు అమలవుతాయని తెలుస్తోంది. మేనేజ్‌మెంట్, కన్వీనర్ కోటాలలో ఫీజులను కూడా కమిషన్ నిర్ధారించిన మేరకు మాత్రమే వసూలు చేయాల్సి ఉంటుంది. ఎవరైనా నిబంధనలను అతిక్రమిస్తే మాత్రం ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోనుంది. ఏ కాలేజీ అయినా జిరాక్స్ సర్టిఫికెట్లతో ఒరిజినల్స్ ను పోల్చుకొని చెక్ చేసుకోవాలే తప్ప ఒరిజినల్ సర్టిఫికెట్లను తమ దగ్గరే ఉంచుకోకూడదు. అరకొర వసతులు ఉండే కాలేజీలకు విద్యాశాఖ కొంత సమయం ఇచ్చి ఆ సమయంలోపు లోపాలను సరిదిద్దుకోని పక్షంలో తగిన చర్యలు తీసుకోనుంది. గతంతో పోలిస్తే ఫీజులు భారీగా తగ్గనున్నాయని సమాచారం అందుతోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: