కొత్త జిల్లాల ఏర్పాటుపై అధికార పార్టీ శాసన సభ్యుల్లో అప్పుడే పంతాలు పట్టింపులు మెదలయ్యాయి. రెవిన్యూ డివిజన్‌లు తమ ప్రాంతానికి కావాలంటే తమ ప్రాంతానికి కావాలంటూ ఎవరికి వారు ప్రయత్నాలు సాగిస్తున్నారు. నరసరావుపేట పార్లమెంట్‌ను జిల్లాగా చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్న సమయంలో రెవిన్యూ డివిజన్ పై ఎమ్మెల్యేలు పట్టుబడుతున్నారు.

 

రాష్ట్రంలో 25జిల్లాల ఏర్పాటు పై ప్రభుత్వం నుండి సానుకూల సంకేతాలు అందుతున్నాయి. ఎన్నికలకు ముందే పార్లమెంట్ కేంద్రాన్ని జిల్లా చేస్తామని జగన్ కూడా ప్రకటించారు. నరసరావుపేట పార్లమెంట్ ప్రాంతాన్ని  పల్నాడు జిల్లా చేయాలని మెజార్టీ శాసన సభ్యులు అభిప్రాయపడుతున్నారు.  ప్రధానంగా జిల్లా కలెక్టర్ కార్యాలయం, ఎస్పీ కార్యాలయంతో పాటు జిల్లా స్థాయి అధికారుల కార్యాలయాలు..తమ ప్రాంతంలో ఉండాలంటే తమ ప్రాంతాల్లో ఉండాలని శాసన సభ్యులు పట్టుబడుతున్నారు. ఈ విషయాన్ని జిల్లా ఇంఛార్జ్ మంత్రి వద్ద పంచాయితీ కూడా పెట్టారు. మాచర్ల నియోజకవర్గంలో రెవిన్యూ ముఖ్య కేంద్రాలు ఏర్పాటు చేస్తే అందరికి సమాన దూరంగా ఉంటుందని చెబుతున్నారు ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి.

 

ఇదిలా ఉంటే, వినుకొండలోనే రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేయాలని స్థానిక శాసన సభ్యుడు కోరుతున్నారు. ఇలా ఆయా నియోజకవర్గాలకు చెందిన శాసన సభ్యులు కొత్త జిల్లా ఏర్పాటులో కీలకంగా మారాలని ఎత్తులకు పై ఎత్తులు వేసుకుంటున్నారు.

 

ఇప్పటికే మెడికల్ కాలేజీ ఏర్పాటుపై శాసన సభ్యులు ఎవరికి వారు ప్రయత్నాలు చేసుకుంటున్నారు. గురజాలలో ఏర్పాటు చేస్తామని సీఎం జగన్ స్వయంగా ప్రకటించినప్పటికీ ఆ తరువాత పరిస్థితులు మారాయి. ఇప్పుడు పల్నాడు జిల్లా పేరుతో పాటు.. రెవిన్యూ డివిజన్ కార్యాలయాలపై అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు ఎవరికి వారు లాబీయింగ్ నడుపుతున్నారు..మొత్తానికి కొత్త జిల్లాల ఏర్పాటుపై అధికార పార్టీ నేతల్లో కలవరం మొదలైంది. రెవెన్యూ డివిజన్లు తమకే దక్కాలంటూ లాబీయింగ్ లు మొదలుపెట్టేశారు. గట్టి పట్టుదలతో ప్రయత్నాలు చేస్తున్నారు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: