పరిశ్రమలు వస్తున్నాయి. తమ బతుకులు మారతాయని సంతోషించారు. అయితే ఆ సంతోషం మూన్నాళ్ల ముచ్చటే అయ్యింది.  వచ్చిన పరిశ్రమలన్నీ థర్మల్ విద్యుత్ ప్లాంట్స్ కావడంతో...వాటి నుంచి వచ్చే కాలుష్యానికి అనారోగ్య పీడితులయి వలస బాట పడుతున్నారు. నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గంలో.... థర్మల్ విద్యుత్ ప్లాంట్స్ వల్ల పరిస్థితులు దుర్భరంగా మారాయి. 

 

పచ్చదనం హరించుకుపోతోంది. పంటపొలం రూపుకోల్పోతోంది. నదీ జలం విషంగా మారుతుంది. సముద్రం కాలుష్య సాగరంగా మారుతుంది. జిల్లాలోని తీరప్రాంత గ్రామాల్లో ఈ దుర్భర సమస్య వెంటాడుతోంది. ఇక్కడ థర్మల్‌ విద్యుదుత్పత్తి కేంద్రాల పుణ్యమా అని భూ, జల, వాయుకాలుష్యం తారస్థాయికి చేరింది. 

 

సర్వేపల్లి నియోజకవర్గంలోని తోటపల్లి , ముత్తుకూరు... గూడూరు నియోజకవర్గంలోని చిల్లకూరు మండలాల్లో ప్రభుత్వ, ప్రైవేటు థర్మల్‌ విద్యుదుత్పత్తి కేంద్రాలు ఏర్పాటు చేశారు. కాలుష్య రహిత, గ్రామాల అభివృద్ధికి అవి సహకరిస్తాయని అప్పటి పాలకులు స్పష్టం చేశారు. అయితే, ప్రస్తుతం అందుకు భిన్నంగా పరిస్థితి కనిపిస్తోంది. అడుగడుగునా కాలుష్యం తారస్థాయికి చేరడం సమస్యగా మారింది. వాస్తవానికి పారిశ్రామిక ప్రగతిని ఎవరూ తప్పుబట్టరు. ఆ మాటున నెలకొన్న నిర్లక్ష్యంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

 

థర్మల్‌ ప్లాంట్ల పరిసర గ్రామాల్లో దయనీయ పరిస్థితులు నెలకొన్నాయి.  గొట్టాల  నుంచి వెలువడే పొగ ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. బూడిద వ్యర్థాలు గాలిలో కలిసి ఊళ్లను కమ్మేస్తున్నాయి. వాతావరణంలో అనేక మార్పులొస్తున్నాయి.  చెట్లు ఎండిపోతుండగా, మనుషులు రోగాలతో సతమతమవుతున్నారు. పరిశ్రమ వ్యర్థాలను సమీప వాగులు, ఏరులతో పాటు సముద్రంలోకి వదిలేస్తుండటం మరో సమస్యగా మారింది. బాధిత గ్రామాలను ఖాళీ చేయిస్తామని.. పరిహారం, పునరావాసం కల్పిస్తామని నాలుగేళ్లుగా చెబుతున్నప్పటికీ తమకు న్యాయం జరగడం లేదని థర్మల్‌ కాలుష్య బాధితులు వాపోతున్నారు.

 

జిల్లాలోని తీరప్రాంత గ్రామాల్లో ప్రస్తుతం తాగునీటి సమస్య తీవ్రంగా వేధిస్తోంది. థర్మల్‌ విద్యుదుత్పత్తి కేంద్రాల కారణంగా వెలువడే కాలుష్యంతో...భూగర్భజలాలు అడుగంటిపోగా.. అరకొరగా వచ్చే నీటిలోనూ ఉప్పుశాతం  ఎక్కువగా ఉంటోంది. నేలటూరులోని దామోదరం సంజీవయ్య ఏపీజెన్‌కో ప్రాజెక్ట్‌కు సంబంధించి నిర్మించిన కొత్త  యాష్‌పాండ్‌లోకి ఉప్పునీటి బూడిద విడుదల జరుగుతోంది. దీంతో భూగర్భ జలాలు కలుషితమవుతాయని పరిసర ప్రాంతాల రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 

 

థర్మల్ ప్రాజెక్టు నుంచి వచ్చే బూడిద, వేడితో అనారోగ్యం ఆవహిస్తోంది.  పంటలు పండని పరిస్థితి నెలకొంది. మరో వైపు యాష్ పాండ్ నుంచి నీటిని బయటకు వదులుతున్న నీరు బకింగ్ హామ్ కాలువలోకి చేరుకుంటుంది. ఈకాలువలో ఉన్న చేపలు,రోయ్యలతో పాటు జలచరాలు చనిపోతున్నాయి. చాలమంది మత్స్య కారులు జీవనం లేకుండా పోతుంది.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: