ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మహిళల భద్రతనే తమ లక్ష్యంగా నిర్ణయించుకొని దిశ చట్టాన్ని తీసుకువచ్చారన్న సంగతి తెలిసిందే. అయితే, ఆపదలో ఉన్న ఏ మహిళ కోసమైనా ఆపన్న హస్తంగా నిలిచే దిశ చట్టాన్ని దేశవ్యాప్తంగా కొన్ని కోట్లమంది కొనియాడారు. అదేవిధంగా దిశ చట్టం అన్ని రాష్ట్రాలలో తీసుకురావాలని ఎంతోమంది మహిళా సంఘాల అధికారులు నిరాహార దీక్షలను కూడా చేపట్టారు. ఆడవారిపై నానాటికీ పెరిగిపోతున్న అఘాయిత్యాలుకు చెక్ పెట్టేందుకు ఈ విప్లవాత్మక బిల్లు ఎంతో ప్రభావం చూపుతుందని చాలా మంది అభిప్రాయపడుతున్నారు. అయితే మరి ఈ చట్టాన్ని తీసుకురావడంతో పాటు.. ఎఫెక్టివ్ గా అమలు చేసేందుకు 13 జిల్లాల్లో 13 ప్రత్యేక కోర్టులను ఏర్పాటు చేయాలని జగన్మోహన్ రెడ్డి ప్రకటించారు.


త్వరలో కేంద్రం ప్రవేశపెట్టే బడ్జెట్లో దిశ చట్టానికి నిధులు కేటాయించబడతాయా లేదా అనే అంశం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. ప్రతి కోర్టును ఏర్పరచడానికి రెండు కోట్ల పైచిలుకు ఖర్చు అవుతుందని తెలుస్తుంది. అదేవిధంగా పోలీసు విభాగంలోని ఫోరెన్సిక్ ల్యాబ్స్ యొక్క సామర్థ్యాన్ని పెంచేందుకు నిధులు తప్పనిసరిగా అవసరం అవుతాయి. ఇందుకోసం కేంద్రం తన బడ్జెట్ ద్వారా సహాయం చేస్తుందా? మహిళల రక్షణకు చారిత్రాత్మకంగా ఆమోదం పొందిన దిశ చట్టానికి కేంద్రం ఎంత ప్రాధాన్యం చూపించనుందో కొన్ని రోజుల్లో తెలిసిపోతుందని రాజకీయ నేతలు చర్చించుకుంటున్నారు.



అదే విధంగా, బాధితులకు మెరుగైన చికిత్సను తక్షణమే అందించే విధంగా ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రత్యేక కేంద్రం ఏర్పాటు చేయనున్నారు. ఇది కూడా డబ్బుతోనే ముడిపడి ఉంది కాబట్టి.. కేంద్రం నుండి ఏదైనా సహాయం అందుతుందా అనే ఆశతో ఏపీ ప్రభుత్వం ఉందని తెలుస్తోంది. హైదరాబాదులోని చటాన్ పల్లి వద్ద ఒక పశు వైద్యురాలి హత్యాచార ఘటన తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దిశ చట్టాన్ని తీసుకొచ్చింది. ఈ దిశ చట్టం ద్వారా సరైన సాక్షాధారాలు ఉంటే కేవలం 21 రోజుల్లోనే నిందితులకు శిక్ష పడేలా చేయడం ఆంధ్ర ప్రదేశ్ సర్కార్ ముఖ్య ఉద్దేశం.

మరింత సమాచారం తెలుసుకోండి: