కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2020 బడ్జెట్‌ను శనివారం సమర్పించనున్నారు. ఇది ఆర్థిక మంత్రిగా సీతారామన్ రెండవ బడ్జెట్ అవుతుంది. 2020-21 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్‌ను లోక్‌సభలో ఉదయం 11 గంటలకు సీతారామన్ ప్రవేశపెడతారు.

మే 2019 సార్వత్రిక ఎన్నికలలో వరుసగా రెండోసారి అధికారాన్ని నిలుపుకున్న తరువాత ఇది నరేంద్ర మోడీ ప్రభుత్వం చేయబోతున్న రెండవ బడ్జెట్.

ప్రస్తుతం నిర్మల సీతారామన్ ప్రవేశపెట్టనున్న బడ్జెట్ కేటాయింపులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్తగా నిర్మిస్తున్న కాకినాడ-గుడివాడకి తీరప్రాంత ఆధారంగా రైల్వే డబ్లింగ్ లైన్ లకు, సరికొత్త కరెంటు లైన్ లకు నిధులు అందుతాయా? అనే సందేహం తలెత్తుతుంది. విజయవాడ, కాకినాడ మచిలీపట్నం, గుడివాడ ఇంకా గూడూరు రైల్వే స్టేషన్లలో అభివృద్ధి కొరకై చేపట్టిన ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు కేంద్రం నిధులను సమర్పించి, రైల్వే పరంగా ప్రజలు ఎదుర్కొంటున్న పలు ఇబ్బందులను పరిష్కరిస్తుందా లేదా అనే అంశం ఆసక్తికరంగా మారింది.

మచిలీపట్నం, నిడదవోలు, గుడివాడ జంక్షన్ మీదుగా వెళ్లే రైల్వే లైన్ల నిర్మాణం ప్రాజెక్టులు వేగవంతం కావాలి. అలాగే కొవ్వూరు భద్రాచలం రైల్వే లైను యొక్క విస్తరణ గత కొన్ని దశాబ్దాలుగా పెండింగ్ లోనే ఉంటుంది. విశాఖపట్నం-వారణాసి, విశాఖపట్నం-బెంగళూరు, తిరుపతి-అయోధ్యల నడుమ కొత్త రైళ్లు ప్రకటించాల్సిన అవసరం ఉంది.


ప్రస్తుతం నిర్మాణంలోనున్న గూడూరు-విజయవాడ మూడోలైనుకు కేంద్ర బడ్జెట్‌లో నిధులు కేటాయించాలి. వాస్తవానికి తెలంగాణ రాష్ట్రం నుండి అస్సాం వరకు రైళ్లలో ప్రయాణికుల రాకపోకలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మీదుగానే జరుగుతున్నాయి. అదేవిధంగా, భారతదేశంలో అత్యధిక ఆదాయాన్ని రాబట్టే వాల్తేరు డివిజన్ కేంద్రం కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లోనే ఉంది. మరి అటువంటప్పుడు ఆంధ్రప్రదేశ్ లో రైల్వే వ్యవస్థ అభివృద్ధి చెందడానికి భారీ ఎత్తున నిధులు కేటాయించాలి. కానీ గత కొన్ని సంవత్సరాలుగా కేంద్రం నుండి నిధులు రాక కీలకమైన రైల్వే ప్రాజెక్టుల నిర్మాణాలన్నీ అరకొరగా సాగుతున్నాయి. మరి రేపు ప్రవేశపెట్టబోయే బడ్జెట్లో రైల్వే ప్రాజెక్టుల కోసం నిధులు కేటాయిస్తారో లేదో చూడాలిక. 

మరింత సమాచారం తెలుసుకోండి: