2019 ఎన్నికల్లో అత్యల్ప మెజారిటీతో గెలిచిన ఎమ్మెల్యే ఎవరైనా ఉన్నారంటే అది మల్లాది విష్ణునే. విజయవాడ సెంట్రల్ నుంచి వైసీపీ అభ్యర్ధిగా పోటీ చేసిన విష్ణు, టీడీపీ అభ్యర్ధి బొండా ఉమాపై కేవలం 25 ఓట్ల తేడాతో గెలిచి సంచలనం సృష్టించారు. అయితే వైసీపీ ఎమ్మెల్యేగా తొలిసారి గెలిచిన విష్ణు...తన రాజకీయ జీవితాన్ని కాంగ్రెస్‌తో మొదలుపెట్టారు. 2004లో దివంగత వైఎస్సార్ నేతృత్వంలోని కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఉడా చైర్మన్‌గా నియమితులయ్యారు. 2004నుంచి 2008 వరకు చైర్మన్‌గా పనిచేశారు. 2009 సార్వత్రిక ఎన్నికల్లో విజయవాడ సెంట్రల్‌ నియోజకవర్గ కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు.

 

ఇక రాష్ట్ర విభజన అయ్యాక 2014లో కాంగ్రెస్‌ తరఫున పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత 2014 నుంచి 2017 వరకు కాంగ్రెస్‌పార్టీ విజయవాడ నగర అధ్యక్షుడిగా పనిచేశారు. అయితే క్రమేపీ కాంగ్రెస్ కనుమరుగైపోతున్న నేపథ్యంలో విష్ణు వైసీపీలోకి వచ్చారు. రావడమే 2019 లో సెంట్రల్ టికెట్ దక్కించుకుని ఓడిపోతారనే స్టేజ్ నుంచి, 25 ఓట్లతో గెలిచి అద్భుతం చేశారు. ఎమ్మెల్యేగా గెలిచాక తాను మరింతగా ప్రజల మధ్యలోకి వెళ్లారు. ప్రతిరోజూ ఉదయం పూట గుడ్ మార్నింగ్ విజయవాడ పేరిట కార్యక్రమం పెట్టుకుని నియోజవర్గంలోని ప్రజలు సమస్యలు తెలుసుకుంటున్నారు.

 

సమస్యలు తెలుసుకోవడమే కాకుండా వెంటనే అధికారులతో మాట్లాడి, వాటి పరిష్కారానికి కృషి చేస్తున్నారు. ఈ క్రమంలోనే మల్లాదికి ప్రాధాన్యత ఇస్తూ జగన్ ప్రభుత్వం బ్రాహ్మణ కార్పొరేషన్ ఛైర్మన్ ఇచ్చింది. అటు పదవి బాధ్యతలు చూసుకుంటూనే నియోజకవర్గంలో సేవలు చేస్తున్నారు. అలాగే అప్పుడప్పుడు ఉచిత వైద్య శిబిరాలని ఏర్పాటు చేసి, ప్రజల ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇక విజయవాడ నగరానికి సెంట్రల్ కీలకంగా ఉండటంతో, జగన్ ప్రభుత్వం పలు అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేస్తుంది.

 

అయితే మొత్తం మీద చూసుకుంటే 25 ఓట్లతో గెలిచిన విష్ణు ఈ 8 నెలల్లో మెజారిటీ పెంచుకున్నారనే చెప్పొచ్చు. కాకపోతే మూడు రాజధానుల పట్ల విజయవాడ నగర ప్రజలు కాస్త నెగిటివ్‌గానే ఉన్నారు. కాబట్టి రానున్న రోజుల్లో ఆ ప్రభావం విష్ణు మీద ఏ మేర పడుతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: