ఏ.పి రాజధాని అమరావతిలో రైతుల ఆందోళనలు కొనసాగుతున్నాయి. అమరావతిలోనే రాజధానిని కొనసాగించాలంటూ 45 రోజులుగా భూములిచ్చిన రైతులు తమ నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. "మూడు రాజధానులు వద్దు, ఒకే రాజధాని ముద్దు!" అంటూ.. రకరకాలుగా ధర్నాలు చేస్తున్నప్పటికీ, వై.సి.పి ప్రభుత్వం పట్టనట్టుగానే వ్యవహరిస్తోంది. ఐతే ఇక్కడ కొసమెరుపేంటంటే, అమరావతి రైతులకు మొన్నటి వరకు టీడీపీ, జనసేన, బీజేపీ వంటి విపక్ష పార్టీలే మద్దతిచ్చాయి. 

 

కానీ తొలిసారిగా అధికార పార్టీకి చెందిన ఎంపీ సంఘీభావం ప్రకటించారు. శుక్రవారం మందడంలో జరిగిన రైతుల దీక్షకు నర్సారావుపేట ఎంపీ "లావు శ్రీకృష్ణదేవరాయలు" హాజరై అందరినీ ఆశ్చర్యానికి గురి చేశారు. స్థానికులతో పాటు ఆయన దీర్ఘ కాలం పాటు దీక్షలో కూర్చుని, సంఘీభావం తెలిపారు. ఏం.పి రాకతో రాజధాని రైతులు తమ హర్షాన్ని వ్యక్తం చేశారు. అనంతరం ఆయన  రైతులను ఉద్దేశించి ప్రసంగించారు.  

 

ఆయన మాట్లాడుతూ.. "రాజధాని రైతులకు కూడా న్యాయం చేస్తాం. వారిని అన్ని విధాలా ఆదుకుంటాం. రైతులకు అర్థమయ్యే విధంగా రాజధాని వికేంద్రీకరణ గురించి వివరిస్తాం. రైతుల కష్టాలు మాకు తెలుసు. వారి గురించి సీఎం జగన్ ఆలోచిస్తున్నారు. వారు ఇక ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదు." అని హితవు పలికారు. ఐతే ఎంపీ ప్రసంగిస్తున్న సమయంలో మందడం రైతులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. 

 

రైతులు మాట్లాడుతూ... అమరావతికి వారు అనుకూలమో కాదో చెప్పాలని డిమాండ్ చేశారు. అమరావతిని రాజధానిగా కొనసాగిస్తామని ప్రకటన చేసి.. ఆ తర్వాత తమతో ప్రభుత్వం చర్చలు జరపాలని డిమాండ్ చేశారు. ఐతే రాజధాని రైతుల అభిప్రాయం కోసం త్వరలోనే ప్రత్యేక కమిటీ పర్యటిస్తుందని.. వారికి తమ డిమాండ్లు చెప్పాలని సూచించారు కృష్ణదేవరాయలు. రైతులకు ఎలాంటి నష్టం జరగదని.. సీఎం జగన్ అందరికీ న్యాయం చేస్తారని, ఎవరూ కలత చెందవద్దని భరోసా ఇచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి: