జేసీ దివాకర్ రెడ్డికి 2007లో ప్రభుత్వం కేటాయించిన సున్నపు రాతి గనుల లీజులను రద్దు చేస్తూ.. మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డికి సీఎం జగన్ ప్రభుత్వం షాక్ ఇచ్చింది. అనంతపురం జిల్లా యాడికిలోని "మెస్సర్స్ త్రిషూల్" సిమెంట్ కంపెనీకి ఇచ్చిన లీజుల్ని రద్దు చేస్తూ ప్రభుత్వం కొద్ది సేపటి క్రితమే ఉత్తర్వులు జారీ చేసింది. యాడికి లోని కొనుప్పలపాడులో ఉన్న సర్వే నెంబరు 22 బిలో ఉన్న 649.86 హెక్టార్ల పరిధిలోని సున్నపు రాతి గనులను గతంలో త్రిశూల్ కంపెనీకి గతంలో ప్రభుత్వం కేటాయించింది.

 

ప్లాంట్ నిర్మాణానికి సంబంధించి ఇప్పటి వరకూ ఎలాంటి పనులు చేయనందువలన ఈ చర్య తీసుకున్నట్లు ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొంది. దీంతోపాటు సిమెంట్ తయారీ ప్లాంట్ నిర్మాణానికి మరో ఐదేళ్ల పొడిగింపు ఇస్తూ గతంలో జారీ చేసిన ఉత్తర్వుల్ని కూడా వెనక్కు తీసుకుంది. వీటన్నిటికంటే ముఖ్యంగా లీజు ప్రాంతం నుంచి 38,212 మెట్రిక్ టన్నుల సున్నపు రాయి నిక్షేపాన్ని అక్రమంగా తవ్వితీయటం, రవాణా చేయటంపై విచారణ కొనసాగుతుందని ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొంది. 

 

వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో 2007 ఆగస్ట్ 1న జేసీ దివాకర్ రెడ్డికి చెందిన త్రిశూల్ కంపెనీకి సిమెంట్ రాయి నిక్షేపాలు తవ్వడానికి ప్రభుత్వం 649.684 హెక్టార్లు లీజుకు ఇచ్చింది. ఆ లీజు గడువు 2027 జూలై 31తో ముగుస్తుంది. అంటే సుమారు 20 సంవత్సరాల పాటు లీజుకు ఇచ్చింది. రెండు సంవత్సరాల్లోపు అక్కడ సిమెంట్ కంపెనీ ఏర్పాటు చేయాలని నిబంధన విధించారు. అయితే, కంపెనీ సిమెంట్ ఫ్యాక్టరీ నిర్మించలేకపోయింది. కానీ, కంపెనీని ఏర్పాటు చేసేందుకు మరో ఐదేళ్లు పొడిగిస్తూ ప్రభుత్వం అప్పట్లో ఉత్తర్వులు జారీ చేసింది. 

 

అయితే, ఆ ఐదేళ్ల గడువును రద్దు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. నిబంధనలు ఉల్లంఘించిన కంపెనీ మీద చర్యలు తీసుకోవాలని కూడా ఉత్తర్వుల్లో పేర్కొంది. ప్రభుత్వం ఇచ్చిన గడువు లోపు సిమెంట్ ఏర్పాటు చేయలేకపోయిన కంపెనీ... ఆ తర్వాత గనుల శాఖకు చెల్లించాల్సిన బకాయిలు రూ.38,03,376 ను కూడా చెల్లించలేదు. ఈ విషయంపై ప్రభుత్వం నోటీసులు కూడా జారీ చేసింది. దీంతోపాటు ప్రభుత్వం నుంచి ఎలాంటి అనుమతి లేకుండా 38,212 మెట్రిక్ టన్నుల సిమెంట్ రాయిని అక్రమంగా తరలించినందుకు నోటీసులు ఇచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి: