సాధారణంగా ఒక్కో ఆలయంలో కానుకలను ఒక్కో రూపంలో ఇస్తూ ఉంటారు. కొందరు భక్తులు నగదు రూపంలో, బంగారం రూపంలో, వస్తువుల రూపంలో కానుకలను వేస్తూ ఉంటారు. మరికొన్ని ప్రాంతాలలో మేకలు, ఎద్దులు, గొర్రెలను కానుకలుగా ఇస్తూ ఉంటారు. ఇలా ఆలయానికి వచ్చిన వస్తువులను, ఆవులు, మేకలు, గొర్రెలను అధికారులు వేలం వేస్తూ ఉంటారు. 
 
హిమాచల్ ప్రదేశ్ లోని అందమైన పర్వత ప్రాంతమైన ధర్మశాలలో ఒక గుడికి భక్తులు మేకపోతులను కానుకలుగా చెల్లిస్తారు. అలా మొక్కులుగా చెల్లించిన మేకలను వేలం వేయగా ఏకంగా కోటీ 32 లక్షల రూపాయలు వచ్చాయి. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. హమీర్ పూర్ జిల్లా డియోసిధ్ లోని బాబా బాలక్ నాథ్ ఆలయానికి వచ్చే భక్తులు కానుకలుగా మేకలను ఇవ్వగా ప్రతి వారం ఆ మేకలను వేలం వేస్తూ ఉంటారు. 
 
2019 సంవత్సరానికి కూడా అదే విధంగా వేలం వేయగా ఏకంగా కోటీ 32 లక్షల రూపాయల ఆదాయం వచ్చింది. గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం ఆదాయం ఎక్కువగా వచ్చిందని 6,371 మేకలను ఈ సంవత్సరం అమ్మామని ఆలయ నిర్వాహకులు చెబుతున్నారు. 2018 సంవత్సరంలో 5,825 మేకలను అమ్మగా కోటీ 19 లక్షల రూపాయల ఆదాయ సమకూరింది. ఈ ఆలయంలో జంతువులను బలి ఇచ్చే సాంప్రదాయం లేకపోవడంతో మేకలను ఇస్తే కోరికలు నెరవేరుతాయని భక్తులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. 
 
హిమాచల్ ప్రదేశ్ లో ఉండే ఈ ప్రాంతం అత్యంత పవిత్రమైన హిందూ మత ప్రదేశం. హిమాచల్ ప్రదేశ్ తో పాటు జమ్మూ కశ్మీర్, ఛండీఘర్, హర్యానా, పంజాబ్ ప్రజలు ఎక్కువగా ఈ ఆలయాన్ని సందర్శిస్తారు. ఆదివారాన్ని బాబా బాలక్ నాథ్ ఆలయంలో పవిత్రమైన రోజుగా గుర్తిస్తారు. ప్రతి సంవత్సరం మార్చి 14 నుండి ఏప్రిల్ 13వరకు ఈ గుడిలో నెలరోజుల ప్రండుగ జరుగుతుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: