ఐదు నుంచి ఆరున్నర శాతానికి వృద్ధి రేటు పెంచటమే లక్ష్యంగా తమ ప్రభుత్వం పని చేస్తోందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. లోక్ సభలో ఆర్థిక సర్వేను ప్రవేశపెట్టిన నిర్మల దేశ పరిస్థితులను కళ్లకు కట్టినట్లు చూపించారు. ఇండియాలో కోట్లాది ఉద్యోగాల సృష్టి జరిగిందని స్పష్టం చేశారు. రేపు లోక్ సభలో బడ్జెట్ ను ప్రవేశ పెడతారు నిర్మలా సీతారామన్. 

 

 పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభమయ్యాయి. తొలుత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఉభయసభలను ఉద్దేశించి సుదీర్ఘ ప్రసంగం చేశారు.  అనంతరం ఎకనమిక్ సర్వేను లోక్‌సభలో ప్రవేశపెట్టారు ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్. ప్రస్తుత వృద్ధిరేటు ఐదు శాతంగా ఉందని ఆర్థిక సర్వేలో వెల్లడించారు. రాబోయే ఆర్థిక సంవత్సరం వృద్ధిరేటు ఆరు నుంచి 6.5 శాతంగా ఉంటుందని అంచనా వేశారు. 2022 నాటికి రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని తెలిపారు. 2011 నుంచి 2018 మధ్య కాలంలో రెండు కోట్ల 62 లక్షల కొత్త ఉద్యోగాల కల్పన జరిగినట్లుగా వివరించారు. గత ఆరు నెలల్లో ద్రవ్యోల్బణం వేగంగా తగ్గిందని ఆర్థిక సర్వే అభిప్రాయపడింది. 

 

ఇక... మార్కెట్లు అందుబాటులోకి తీసుకురావడం, వ్యాపార అనుకూల విధానాలను ప్రోత్సహించడం, ఆర్థిక వ్యవస్థల్లో విశ్వాసాన్ని పెంపొందించడం అనే ఇతివృత్తంతో 2019-20 ఆర్థిక సర్వేను తీసుకొచ్చారు. 5 ట్రిలియన్‌ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మారడానికి నైతిక విలువలతో కూడిన సంపద చాలా కీలకం అని సర్వే అభిప్రాయపడింది. వచ్చే ఆర్థిక సంవత్సరంలో కూడా ప్రపంచంలోని పరిస్థితులు భారత్‌కు అనుకూలంగా ఉంటాయని ఆర్థిక సర్వే వెల్లడించింది.

 

 మరోవైపు... ద్రవ్యలోటు విషయంలో కొంత సడలింపు ఉండాలని సర్వే సూచించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో పన్ను ఆదాయాలు అంచనాల కంటే తగ్గే అవకాశం ఉంది. వచ్చే ఆర్థిక సంవత్సరంలో జీఎస్‌టీ పన్ను ఆదాయం పెరిగే అవకాశం ఉంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సర ఆర్థిక వ్యవస్థ స్థితిగతులను సమీక్షించేందుకు ప్రభుత్వం ప్రధానంగా ఈ ఆర్థిక సర్వేను తయారుచేస్తుంది. ఆర్థిక వ్యవస్థ వృద్ధి బాట పట్టడానికి చేయాల్సిన విధాన మార్పులతో పాటు ప్రభుత్వం ఏం చేయాలన్నదానిపైనా సర్వే సూచనలు చేస్తుంది. 


 
భారత్‌లో పెట్టుబడుల ఉపసంహరణ వేగవంతంగా జరగాలని సర్వే వెల్లడించింది. లాభదాయకత, సామర్థ్యం, పోటీతత్వం, నైపుణ్యం పెంచడానికి ఇది అవసరం అని వెల్లడించింది. ఉచితాలు ఆర్థిక వ్యవస్థకు నష్టదాయకం అని సర్వే చెప్పింది. లబ్ధిదారులు తక్కువ ఖర్చుపెడతారు. తక్కువ పొదుపు చేస్తారు. తక్కువ పెట్టుబడి పెడతారని చెప్పింది ఆర్థిక సర్వే. 

మరింత సమాచారం తెలుసుకోండి: