వుహాన్ లో చిక్కుకుపోయిన ఇండియన్స్ ను స్వదేశం రప్పించేందుకు ముమ్మ్ర ప్రయత్నాలు జరుగుతున్నాయ్. ఈ రోజు మధ్యాహ్నం ఎయిర్ ఇండియా ఫ్లైట్ వుహాన్ బయల్దేరి వెళ్లింది. ఈ విమానంలోనే భారతీయులందరినీ తీసుకువస్తారు. తమ వారి రాక కోసం బంధువులు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. 

 

చైనాలో ఉన్న భారతీయులను తీసుకొచ్చేందుకు ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ ఎయిరిండియాకు చెందిన జంబో విమానం బీ747 వుహాన్‌కు బయలుదేరి వెళ్లింది. ఢిల్లీ నుంచి శుక్రవారం మధ్యాహ్నం 1.20కి ఈ విమానం బయలుదేరినట్లు అధికారులు వెల్లడించారు. శనివారం తెల్లవారుజామున 2 గంటలకు ఎయిర్ ఇండియా విమానం తిరిగి భారత్‌ చేరుకుంటుంది. వుహాన్‌ విమానాశ్రయంలో ఇది 2 నుంచి 3 గంటల పాటు ఉంటుంది. వుహాన్‌ నుంచి మొత్తం 400 మంది భారతీయులను ఈ విమానం స్వదేశానికి తీసుకువస్తుంది. ఆరోగ్య మంత్రిత్వ శాఖకు చెందిన ఐదుగురు వైద్య నిపుణులు ఇందులో వెళ్లారు. విమాన సిబ్బందికి, ప్రయాణికులకు అవసరమైన మాస్క్‌లను వెంట తీసుకెళ్లారు. రెండు విమానాల ద్వారా వుహాన్‌లో ఉన్న భారతీయులను స్వదేశానికి చేరుస్తారు. శుక్రవారం బయల్దేరిన ఎయిర్ ఇండియా విమానంలో 400 మందిని తీసుకురానున్నారు. వాళ్లని 14 రోజుల పాటు ప్రత్యేక వార్డులో ఉంచి వైద్యులు పర్యవేక్షిస్తారు.

 

 ఇక...వుహాన్‌ నుంచి వచ్చిన భారతీయులకు కేంద్ర విదేశాంగశాఖ, ఆరోగ్యశాఖ తగిన ఏర్పాట్లు చేసింది. వుహాన్‌లో ఉన్న భారతీయులను స్వదేశానికి పంపించేందుకు శుక్రవారం ప్రత్యేకంగా అక్కడి విమానాశ్రయాన్ని తెరిచారు. ఈ విమానంలో కనీసం 350 మంది విద్యార్థులను స్వదేశానికి పంపిస్తారు. మొత్తం 432 మంది కూర్చునే సామర్థ్యం ఈ విమానానికి ఉంది. శనివారం కూడా మరో విమానాన్ని వుహాన్‌ నుంచి భారత్‌కు నడపనున్నారు. వుహాన్‌లో పుట్టుకొచ్చిన కరోనా వైరస్‌ కారణంగా చైనాలో ఇప్పటి వరకు 213 మంది ప్రాణాలు కోల్పోయారు. 9,692 కేసులు నమోదయ్యాయి. హుబేయి ప్రావిన్స్‌లోనే అత్యధిక మరణాలు చోటుచేసుకున్నాయి. చనిపోయిన వారిలో 204 మంది హుబేయి ప్రావిన్స్‌కు చెందిన వారు కాగా 5,806 కేసులు నమోదైనట్టు అధికారులు వెల్లడించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: