కరోనా వైరస్ మనుషుల్లో మానవత్వాన్ని సైతం కబళిస్తోంది. మరణించిన వారి దగ్గరకు వెళ్లేందుకు కూడా జనం భయపడేలా చేస్తోంది. ఇలాంటి ఘటనే వుహాన్ లో చోటుచేసుకుంది. కరోనా వైరస్ బారిన పడి చైనాలో ఇప్పటి వరకూ రెండు వందల మందికి పైగానే మరణించారు. వుహాన్ నగరాన్ని  బంధించారు. వుహాన్ కు మనుషుల రాకపోకలను నిషేధించారు. 

 

ప్రాణాంతకమైన కరోనా వైరస్ ప్రపంచ వ్యాప్తంగా జనాన్ని భయ భ్రాంతులకు గురి చేస్తోంది. ఎప్పుడూ రద్దీగా ఉండే చైనాలోని వీధులు మనుషులు  లేక వెలవెలబోతున్నాయి. కరోనా వైరస్‌ భయంతో అవసరమైతే తప్ప ప్రజలు బయటికి రావడం లేదు. ప్రాణాంతక వ్యాధి భయం మానవత్వాన్ని సైతం  చంపేస్తోంది. చైనాలోని వుహాన్‌లో రోడ్డు పక్కన ఓ శవం పడి ఉంది. కరోనా వైరస్ భయంతో ఎవ్వరూ కనీసం అటువైపు తొంగి చూడలేదు.

 

కనీసం చనిపోయిన వ్యక్తి ఎవరో అని తెలుసుకునేందుకు కూడా వ్యక్తులు సాహసించలేదు. ఈ భయం మనుషులను ఎంతగా కమ్మేసిందో ఈ  ఘటనను బట్టే అర్థం చేసుకోవచ్చు. కాసేపటి తర్వాత ఓ జర్నలిస్టు ఫొటో తీయడంతో అసలు విషయం బయటికి వచ్చింది. చాలా సేపటి తర్వాత ఆ  మృతదేహాన్ని వైద్య సిబ్బంది, పోలీసులు కలిసి ఆసుపత్రికి తరలించారు.

 

అయితే .. స్థానికులు మాత్రం కరోనా వైరస్ భయం వల్లే తాము మృతదేహం వైపు వెళ్లలేదని అంటున్నారు. కరోనా వైరస్‌ సోకి ఇప్పటికే చాలా మంది  చనిపోయారు. ఆయన కూడా ఆ వైరస్ సోకే చనిపోయాడని తమ భయం అని చెబుతున్నారు స్థానికులు. ఒకవేళ మృతదేహం దగ్గరికి వెళితే... వైరస్ సోకే  ప్రమాదం ఉంది. అందుకే వెళ్లలేదు అని తెలిపారు. ఆ వ్యక్తి ఎలా చనిపోయారన్నది మాత్రం ఇంకా తెలియలేదు. మృతదేహాన్ని తరలించిన తర్వాత ఆ  పరిసరాలను రసాయనాలతో పోలీసులు శుభ్రం చేశారు.

 

ఇక...కరోనా వైరస్‌ మొదటగా పుట్టుకొచ్చింది వుహాన్‌లోనే. అక్కడి నుంచి చైనా సహా ఇతర దేశాలకు పాకింది. ఇప్పటికే ఈ వ్యాధి కారణంగా  చైనాలో 200 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. ఒక్క వుహాన్‌లోనే 159 మంది మరణించారు. వేల మంది వైరస్‌ బారిన పడ్డారు. మరోవైపు కరోనా ప్రభావంతో  వుహాన్‌ నగరాన్ని నిర్బంధించారు. ఇక్కడి ప్రజలు నగరం దాటి బయటకు వెళ్లకుండా.. బయటి వ్యక్తులు వుహాన్‌కు రాకుండా ఆంక్షలు విధించారు. కరోనా  కేసులతో వుహాన్‌ వ్యాప్తంగా ఉన్న ఆసుపత్రులు నిండిపోయాయి. ఒక్కో చోట రోగులు డాక్టర్‌ను కలిసేందుకు రెండు రోజుల సమయం పడుతోందట. వైరస్‌ తీవ్రత  కారణంగా ఇప్పటికే ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇంటర్నేషనల్ హెల్త్ ఎమర్జెన్సీ విధించింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: