రాజధాని మార్పు నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ అమరావతి ప్రాంత రైతుల ఆందోళనలు దాదాపు 45 రోజులకుపైగా సాగుతున్నాయి. అయినా ప్రభుత్వం అటువైపు కన్నెత్తయినా చూడటం లేదు. రైతులకు కూడా మేలు చేస్తాం.. చూస్తాం.. అంటున్న మంత్రి బొత్స సత్యనారాయణ వంటి నేతల మాటలు తప్పించి.. రైతుల విషయంలో మాత్రం జగన్ పెద్దగా సానుకూల వైఖరి ఇప్పటి వరకూ తీసుకోలేదు.

 

ఇదే అదనుగా టీడీపీ అధినేత చంద్రబాబు అమరావతి రైతుల్లోని ఆగ్రహాన్ని ఓ ఉద్యమంగా మలిచే ప్రయత్నం చేసి విఫలమవుతున్నారు. మరోవైపు విశాఖను ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ చేసే దిశగా జోరుగా నిర్ణయాలు సాగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో అకస్మాత్తుగా జగన్ అమరావతి రైతుల విషయంలో కాస్త సానుకూల వైఖరి తీసుకున్నారా అన్న అనుమానం వచ్చే సంఘటన శుక్రవారం చోటు చేసుకుంది. అమరావతి రైతులను పరామర్శించేందుకు వైసీపీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు వెళ్లారు.

 

అక్కడ రైతులనుద్దేశించి మాట్లాడారు. రైతులుఎవరూ ఆవేశాలకు పోవద్దని ఎంపీ సూచించారు. మందడం, వెలగపూడిలో రైతుల దీక్షా శిబిరానికి ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు వెళ్లారు. సీఎం వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి రైతులకు కచ్చితంగా న్యాయం చేస్తారని చెప్పారు. రాజకీయాల్లో ఒక స్థాయికి వచ్చిన తరువాత ఏ వర్గాన్ని వ్యతిరేకం చేసుకోవాలనుకోరు. రైతులందరూ ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలన్నారు.

 

వెలగపూడి నుంచి కొందరు మహిళలు వచ్చి తనను కలిశారని.. తొందరపడి ఒక నిర్ణయానికి రావొద్దని... రైతులతో చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని.. ఎంపీ అన్నారు. మీతో చర్చలు జరిపేందుకు వచ్చినప్పుడు మీరు కూడా ముందుకు రావాలని సూచించారు. ఇలా ఓ వైసీపీ ఎంపీ అమరావతి రైతుల శిబిరానికి వచ్చి సానుకూలంగా మాట్లాడడటం ఇదే ప్రథమం.

 

రాజధాని రైతులను చర్చలకు ఒప్పించేందుకే జగన్ పంపి ఉంటారన్న చర్చ ఆ ప్రాంతంలోనడుస్తోంది. అదే నిజమైతే పాపం.. చంద్రబాబు ఉద్యమం ఏం కావాలో..?

మరింత సమాచారం తెలుసుకోండి: