ప్రభుత్వానికి అతి పెద్ద ఖర్చు ఏదైనా ఉందంటే.. అది ఉద్యోగస్తుల జీత భత్యాలే. ప్రభుత్వ వ్యయంలో అధిక శాతం డబ్బు దీనికే సరిపోతుంది. అయినా ప్రభుత్వ రంగంలో ఎప్పుడూ ఉద్యోగుల కొరతే ఉంటుంది. మరీ ముఖ్యంగా చూసుకుంటే.. విద్య, ఆరోగ్యం, శాంతిభద్రతల విభాగాల్లో ఎన్ని ఉద్యోగాలు నింపినా ఇంకా కొరత కనిపిస్తూనే ఉంటుంది. ఎందరు ముఖ్యమంత్రులు మారినా ఈ పరిస్థితుల్లో పెద్దగా మార్పు రాలేదు.

 

 

అయితే ప్రస్తుత సీఎం జగన్ మాత్రం.. ఈ విషయంలో ఎక్కడా తగ్గడం లేదు. ప్రజలకు అవసరమైన చోట్ల సిబ్బంది నియామకాలకు పెద్ద పీట వేస్తూనే ఉన్నారు. ఇప్పటికే జగన్.. వచ్చాక లక్షల సంఖ్యలో ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేశారు. తాజాగా జరిపిన ఓ సమీక్షలోనూ జగన్ ఉద్యోగాల భర్తీకి పచ్చ జెండా ఊపేశారు. వైద్య, విద్యా రంగాల్లో సమూల మార్పులు ఆశిస్తున్నానంటున్న జగన్.. వీటిలో అవసరమైన ఉద్యోగాలన్నింటినీ భర్తీ చేయాలని ఆదేశించారు.

 

 

ఉద్యోగాల భర్తీ కోసం క్యాలెండర్‌పై ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని, సీఎస్‌ నీలం సాహ్ని, డీజీపీ గౌతం సవాంగ్, సంబంధిత శాఖల ఉన్నతాధికారులు హాజరయ్యారు. సీఎం వైయస్‌ జగన్‌ మాట్లాడుతూ.. పోలీస్‌ విభాగాల్లో వీక్లీ ఆఫ్‌ అమలు చేస్తున్నామన్నారు. వీక్లీ ఆఫ్‌ సమర్థవంతంగా అమలుకు అవసరమైన సిబ్బందిని నియమించాలని జగన్ సూచించారు.

 

 

అదే విధంగా పాఠశాలల్లో నాడు – నేడు కార్యక్రమం చేపడుతున్నామని, టీచర్లు సరిపడా లేకుంటే నాణ్యత లోపిస్తుందని, టీచర్లతో సహా, స్కూళ్లలో ల్యాబ్‌ టెక్నీషియన్లను కూడా నియమించాలని అధికారులకు జగన్ సూచించారు. రెవెన్యూ విభాగంలోనూ ప్రాధాన్యమైన పోస్టుల భర్తీపై దృష్టిపెట్టాలని ఆదేశించారు. మరి జగన్ ఆశిస్తున్న మార్పు ప్రభుత్వ ఉద్యోగులు సాధించగలుగుతారా.. అన్నది వేచి చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: