వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని ... ట్రాఫిక్ పోలీసులు ఎన్నో  ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. మామూలుగా అయితే అవగాహన కార్యక్రమాలు చేపడతారు. అయితే కేవలం అవగాహన కార్యక్రమాల ద్వారా మార్పు రావడం లేదని గ్రహిస్తే మాత్రం ఎన్నో వినూత్న కార్యక్రమాలతో వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలకు అనుగుణంగా వాహనాన్ని నడిపేలా చేస్తారు. ఇప్పటికే ట్రాఫిక్ పోలీసులు హెల్మెట్ ధరించిన వాహనదారులకు పలు ఆఫర్లు కూడా ప్రకటించారు. తాజాగా ఇలాంటి వినూత్న ఆలోచన చేశారు ట్రాఫిక్ పోలీసులు. ఎలాగైనా వాహనదారులు లో మార్పు తీసుకురావాలని భావించి సరికొత్త ఆఫర్ను ప్రకటించారు. 

 

 

 హైదరాబాద్ లోని ఎల్బీనగర్ పోలీసులు వాహనదారులు హెల్మెట్ ధరించేలా  వినూత్న కార్యక్రమాలు చేపట్టారు. రోడ్డు భద్రతా వారోత్సవాలను పురస్కరించుకుని ట్రాఫిక్ పోలీసులు వినూత్న ఆలోచన చేశారు. బైక్పై వెళ్తున్న వ్యక్తి తో పాటు వెనక వ్యక్తి కూడా హెల్మెట్ ధరించి ప్రయాణిస్తే... ట్రాఫిక్ పోలీసులు వారికి ఒక లీటర్ పెట్రోల్ కూపన్  అందజేస్తున్నారు . కాగా ఈరోజు ఆఫర్ కి  ఎంతో మంది వాహనదారులు ఆకర్షితులవుతున్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన అడిషనల్ ఇన్ స్పెక్టర్ అంజంపల్లి  నాగమల్లు... ప్రతి సంవత్సరం  లక్షల రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని.. ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారని తెలిపారు . అంతే కాకుండా రోడ్డు ప్రమాదాల్లో ఎంతోమంది అంగవైకల్యులుగా కూడా మారుతున్నారు తెలిపారు. హెల్మెట్ ధరించడం వల్ల ప్రమాదం  నుంచి తప్పించుకోవచ్చు అని తెలిపారు. 

 

 

 రోడ్డు భద్రతా వారోత్సవాల్లో భాగంగా ఎంతోమంది వాహనదారులకు అవగాహన కల్పిస్తున్నామని... ఈ క్రమంలోనే  వాహనదారులు హెల్మెట్ పెట్టుకునెలా  ప్రోత్సహించేందుకు వినూత్న ఆలోచన చేసినట్లు తెలిపారు. పోలీసులు చేపట్టిన ఈ కార్యక్రమానికి అటు వాహనదారులు కూడా ఆకర్షితులవుతున్నారు. హెల్మెట్ పెట్టుకుని  లీటర్ పెట్రోల్ కూపన్లు పొందుతున్నారు వాహనదారులు. వినూత్న ఆలోచన చేసిన పోలీసులకు హ్యాట్సాఫ్ అంటున్నారు పలువురు.

మరింత సమాచారం తెలుసుకోండి: