తొలుత ఉభయసభలను ఉద్దేశించి రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ప్రసంగించారు.. తరువాత ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆర్ధిక సర్వేను ప్రవేశపెట్టారు.. అనంతరం లోక్ సభను రేపటికి వాయిదా వేశారు... 

ఆర్థిక సర్వేలో ముఖ్యమైన అంశాలు..

*మార్కెట్లు అందుబాటులోకి తీసుకురావడం, వ్యాపార అనుకూల విధానాలను ప్రోత్సహించడం, ఆర్థిక వ్యవస్థల్లో విశ్వాసాన్ని పెంపొందించడం అనే ఇతివృత్తంతో 2019-20 సర్వేను తీసుకొచ్చారు.

* 5ట్రిలియన్‌ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మారడానికి నైతికవిలువలతో కూడిన సంపద చాలా కీలకం

* ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో పన్ను ఆదాయాలు అంచనాల కంటే తగ్గే అవకాశం ఉంది.

* వచ్చే ఆర్థిక సంవత్సరంలో జీఎస్‌టీ పన్ను ఆదాయం పెరిగే అవకాశం ఉంది.

* ప్రస్తుత ఆర్థిక వృద్దిరేటు 5శాతం ఉంది.

* ఏప్రిల్‌1తో మొదలయ్యే ఆర్థిక సంవత్సరంలో వృద్ధిరేటు 6-6.5శాతం మధ్య ఉండవచ్చని అంచనా.

* వచ్చే ఆర్థిక సంవత్సరంలో కూడా ప్రపంచంలోని పరిస్థితులు భారత్‌కు అనుకూలంగా ఉంటాయి.

* ఈ సారి ఆర్థిక కవర్‌ పేజీలను ఊదారంగులో తయారు చేశారు.

* ద్రవ్యలోటు విషయంలో కొంత సడలింపు ఉండాలని సర్వే సూచించింది.

*2011-12 నుంచి 2017-18 మధ్యలో 2.62 కోట్ల ఉద్యోగాల సృష్టి జరిగింది. 

* ‘తాలినామిక్స్‌’ పేరుతో అర్థశాస్త్రాన్ని సామాన్యూడికి అన్వయించే ప్రయత్నం చేశారు. ఒక ప్లేటు భోజనం కొనుగోలు చేసేశక్తి 29శాతం మెరుగుపడిందని ఈ సర్వే పేర్కొంది. 

* 2022 నాటికి వ్యవసాయదారుల ఆదాయం రెట్టింపు చేసేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉంది.

* ప్రభుత్వం చిన్న, సూక్ష్మ, మధ్యతరహా వ్యాపార సంస్థలకు రుణసదుపాయం, సాంకేతికతను అందించడం, ఈవోడీబీ, మార్కెట్లను అందుబాటులోకి తీసుకువచ్చేందుకు కట్టుబడి ఉంది.

* హైవేలు, రోడ్లపై పెట్టుబడులు 2014-15 నుంచి 2018-19 వరకు మూడు రెట్లు పెరిగాయి. 

* భారత వాణిజ్య పరిమాణంలో 95శాతం మొత్తం, కరెన్సీ విలువలో 68శాతం సరుకులు సముద్రమార్గంలోనే రవాణా చేశారు. 

* భారతీయ రైల్వే ప్రపంచంలోనే అత్యధిక మందిని రవాణా చేసిన సంస్థగా రికార్డు సృష్టించింది. 120 కోట్ల టన్నుల సరకు, 840 కోట్ల మంది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చింది. 

* భారత్‌లో పెట్టుబడుల ఉపసంహరణ వేగవంతంగా జరగాలని సర్వే వెల్లడించింది. లాభదాయకత, సామర్థ్యం, పోటీతత్వం, నైపుణ్యం పెంచడానికి ఇది అవసరం అని పేర్కొంది. 

* ఉచితాలు ఆర్థిక వ్యవస్థకు నష్టదాయకం అని సర్వే స్పష్టం చేసింది.. లబ్ధిదారులు తక్కువ ఖర్చుపెడతారు.. తక్కువ పొదుపు చేస్తారు.. తక్కువ పెట్టుబడి పెడతారని చెప్పింది. 

* మాఫీలు రుణ వ్యవస్థను దెబ్బతీస్తాయని వెల్లడించింది.  

2020- 21 వార్షిక బడ్జెట్ ను నిర్మలా సీతారామన్ రేపు ఉదయం 11 గంటలకు ప్రవేశపెట్టనున్నారు. ఆర్ధిక మాంద్యం నెలకొన్న సమయంలో ఈ బడ్జెట్ లో సంస్కరణలకు ప్రాధాన్యమిచ్చే అవకాశం ఉంది...

 

మరింత సమాచారం తెలుసుకోండి: