ఏపీ సీఎం జగన్ ప్రతి సంవత్సరం జనవరి నెలలో ఉద్యోగ క్యాలెండర్ ను విడుదల చేస్తామని ఉద్యోగ ఖాళీలను పరీక్షలు నిర్వహించి భర్తీ చేస్తామని చెప్పిన విషయం తెలిసిందే. అధికారులు ఇప్పటివరకు ప్రభుత్వ శాఖల్లో దాదాపు 63వేల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నట్టు గుర్తించారు. ప్రభుత్వ శాఖలలో ఖాళీలపై ఇంకా అధ్యయనం జరుగుతోందని మరో 15,000 ఉద్యోగాల వరకు పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతూ ఉండటం గమనార్హం. 
 
నిన్న సీఎం జగన్ ఉద్యోగ ఖాళీల భర్తీ క్యాలెండర్ విడుదల గురించి తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో సమావేశాన్ని నిర్వహించారు. సీఎం జగన్ ఈ సమావేశంలో అవసరాలకు అనుగుణంగా ప్రభుత్వ పాఠశాలల్లో ఉద్యోగ నియామకాలు, వైద్యులు, నర్సులు, ఫార్మసిస్టులు, టెక్నీషియన్ల పోస్టుల భర్తీ జరగాలని సూచించారు. సమగ్ర క్యాలెండర్ ను రూపొందించి దశల వారీగా పోస్టుల భర్తీ చేపట్టాలని సీఎం జగన్ చెప్పారు. 
 
ప్రభుత్వ పాఠశాలలో నాడు - నేడు పథకం కింద కోట్ల రూపాయలు ఖర్చు పెడుతూ ఉన్నందువలన సరిపడా సిబ్బంది ఉండాలని లేకపోతే పెట్టిన ఖర్చు వృథా అవుతుందని సీఎం జగన్ చెప్పారు. టీచర్లతో పాటు ల్యాబ్ టెక్నీషియన్లను కూడా నియమించాలని అప్పుడే చేపడుతున్న పనుల్లో నాణ్యత వంటి చర్యలకు అర్థం ఉంటుందని అన్నారు. పోలీస్ శాఖలో వారాంతపు సెలవులను ప్రకటించటం వలన ఆ శాఖలో ఉద్యోగాలను భర్తీ చేయాలని చెప్పారు. 
 
ఈ నెల 21వ తేదీన సీఎం జగన్ మరోసారి అధికారులతో భేటీ కానున్నారు. ఈ భేటీ తరువాత ఉద్యోగాల భర్తీ గురించి కార్యాచరణను ప్రకటించటంతో పాటు సమగ్ర క్యాలెండర్ ను కూడా ప్రభుత్వం విడుదల చేయనుంది. తెలుస్తున్న సమాచారం మేరకు ఏపీపీఎస్సీ ద్వారా 19,000 ఉద్యోగాల భర్తీ, డీఎస్సీ ద్వారా 21,000 ఉద్యోగాల భర్తీ, పోలీస్ శాఖలో 13,000 ఉద్యోగాల భర్తీ జరగనుందని తెలుస్తోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: