ఏపీ సీఎం జగన్ డిసెంబర్ నెలలో జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో ఏపీకి మూడు రాజధానులు ఉండవచ్చని ప్రకటన చేసిన తరువాత మూడు రాజధానుల బిల్లుకు జనవరిలో అసెంబ్లీ ఆమోదం తెలపగా శాసన మండలి సభ్యులు మాత్రం బిల్లును సెలక్ట్ కమిటీకి పంపారు. ఆ తరువాత ప్రభుత్వం శాసన మండలి రద్దు కోసం తీర్మానం జరిపి ఆ తీర్మానం ఓటింగ్ ద్వారా ఆమోదం పొందిన తరువాత శాసన మండలి రద్దు తీర్మానాన్ని కేంద్రానికి పంపిన విషయం తెలిసిందే. మండలి రద్దు గురిoచి నిర్ణయం వెలువడక ముందే తాజాగా ఏపీ ప్రభుత్వం అధికారికంగా పాలనా వికేంద్రీకరణను ప్రారంభించింది. 
 
ఏపీ పరిపాలనా వికేంద్రీకరణ దిశగా సీఎం జగన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఏపీ ప్రభుత్వం కమిషనరేట్ ఆఫ్ ఎంక్వైరీస్ ఛైర్మన్ సభ్యుల ఆఫీస్ లను, పాక్షిక న్యాయ విభాగమైన విజిలెన్స్ కమిషన్ ను కర్నూలుకు తరలిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు ఈ విభాగాలన్నీ వెలగపూడి సచివాలయంలో భాగంగా ఉన్నాయి. కానీ సీఎం జగన్ తీసుకున్న నిర్ణయంతో ఈ విభాగాలన్నీ కర్నూలుకు తరలించనున్నట్టు అధికారికంగా ప్రకటన వెలువడింది. 
 
కర్నూలు జిల్లా కలెక్టర్ కు మరియు ఆర్ అండ్ బీ శాఖ అధికారులకు ఏపీ ప్రభుత్వం ఈ మేరకు ఆదేశాలను జారీ చేసింది. ప్రభుత్వం గతంలోనే న్యాయ సంబంధిత కార్యాలయాలన్నింటినీ కర్నూలులో పెడతామని స్పష్టం చేసిన విషయం తెలిసిందే. తాజాగా ప్రభుత్వం ఆ దిశగా చర్యలు చేపట్టింది. ఏ ప్రభుత్వ కార్యాలయాన్ని కూడా అనుమతి లేకుండా తరలించవద్దని గతంలో న్యాయస్థానం ప్రభుత్వానికి సూచించింది. 
 
కానీ ఏపీ ప్రభుత్వం పరిపాలనా సౌలభ్యం కొరకు ఆఫీసులను కర్నూలుకు తరలిస్తూ నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని ఈ మేరకు ఉత్తర్వులను జారీ చేశారు. న్యాయ రాజధానిగా కర్నూలును రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం కార్యాలయాలను తరలించాలనే నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: