సంప్రదాయాన్ని పక్కన బెడుతూ గతసారి బడ్జెట్‌ పత్రాలను ఎర్రటి వస్త్రంతో చుట్టిన సంచీ(బాహీ ఖాటా)లో తీసుకొచ్చిన ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌.. ఈసారి కూడా అదే పద్ధతిని కొనసాగించారు. కేంద్ర బడ్జెట్‌ను సమర్పించేందుకు బంగారు రంగు చీరలో నిరాడంబరంగా నార్త్‌ బ్లాక్‌లోని తన కార్యాలయం నుంచి నిర్మలమ్మ బయల్దేరారు. ఎర్రని వస్త్రంతో చుట్టిన పద్దుల సంచీతో రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ను కలిశారు. ఈ సంచీపై బంగారు రంగులో భారత జాతీయ చిహ్నం ఉంది. 

 

ఈ చిహ్నం ముద్రకే తాళం చెవితో బ్యాగును తెరిచే వీలుంటుంది. అంతకుముందు వరకు బడ్జెట్‌ పత్రాలను ఆర్థిక మంత్రులు బ్రీఫ్‌కేస్‌లో తీసుకొచ్చేవారు. అయితే గతేడాది ఆర్థికశాఖ బాధ్యతలు చేపట్టిన నిర్మల.. పాత సంప్రదాయాన్ని మార్చి పద్దుల సంచీ తీసుకొచ్చారు. రాష్ట్రపతిని కలిసిన అనంతరం నిర్మలమ్మ బృందం పార్లమెంట్‌కు బయల్దేరుతుంది. ఈ ఉదయం 11 గంటల తరువాత లోక్‌సభలో బడ్జెట్‌ ప్రవేశపెట్టనున్నారు.

 

2020-21 ఆర్థిక సంవత్సరానికి గాను కేంద్ర బడ్జెట్‌ను కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలాసీతారామన్ శనివారం పార్లమెంటులో ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో ఆమె కుటుంబసభ్యులు పార్లమెంటుకు తరలివచ్చారు. నిర్మలాసీతారామన్ కుమార్తె పరకాల వాజ్మయి కూడా పార్లమెంటు గ్యాలరీకి వచ్చారు. తల్లి ప్రవేశపెట్టే బడ్జెట్ ను వినేందుకు ఆమె కుమార్తె పరకాల వాజ్మయి రావడంతో పార్లమెంటు అధికారులు ఆర్థిక శాఖ మంత్రి కుటుంబసభ్యులను పార్లమెంటులోని సందర్శకుల గ్యాలరీలోకి తీసుకువెళ్లారు.

 

ఈసారి బడ్జెట్‌పై ప్రజలతోపాటు కంపెనీలు కూడా భారీగానే అంచనాలు పెట్టుకున్నాయి. వేతన జీవులు, వ్యవసాయ రైతులు, మధ్యతరగతి ప్రజలకు బడ్జెట్‌లో ఎలాంటి ప్రాధాన్యం లభిస్తుందో అని ఎదురుచూస్తున్నారు. దాదాపు సభ్యులు అందరూ ఇప్పటికే పార్లమెంటుకు చేరుకున్నారు. ఈ సమావేశాల్లో ఖచ్చితంగా పాల్గొనాల్సిందిగా బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు తమ ఎంపీలను ఆదేశించాయి. శుక్రవారం ప్రారంభమైన పార్లమెంటు సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వం ఆర్ధిక సర్వేను ప్రకటించిన సంగతి తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: