బడ్జెట్ 2020-21 ను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్‌లో ప్రవేశపెడుతున్నారు. ఎనిమిది నెలల కిందటే లోక్‌సభ ఎన్నికలు ముగియడం, మోదీ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రవేశపెట్టిన మొదటి బడ్జెట్‌ కావడంతో దేశ ప్రజలంతా ఆసక్తిగా బడ్జెట్ ప్రసంగాన్ని తిలకిస్తున్నారు. ఈ బడ్జెట్‌లో వ్యవసాయం, విద్య, వైద్యం, పారిశ్రామిక రంగాలకు కేంద్రం పెద్ద పీట వేసింది. ఈ క్ర‌మంలోనే ఆమె ముఖ్యంగా రైతులపై వరాల జల్లు కురిపించారు. కేంద్రం ప్రభుత్వం ఇక నుంచి రైతుల కోసం కిసాన్ రైలు అందుబాటులోకి తీసుకొస్తుందన్నారు.

 

2022 నాటికి రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయడమే లక్ష్యంగా పనిచేస్తామన్నారు. 6.1 కోట్ల మంది రైతులకు ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన అందిస్తున్నామన్నారు. అలాగే వర్షాభవ జిల్లాలకు అదనపు నిధులు, తీవ్ర నీటికొరత ఉన్న వంద జిల్లాలకు నిధుల కేటాయింపు, సౌగునీటి సౌకర్యాలు కల్పించేలా ప్రాధాన్యం, రైతులకు 20 లక్షల సోలార్‌ పంపుసెట్లు, బీడు భూముల్లో సోలార్‌ విద్యుత్‌ కేంద్రాల ఏర్పాటుకు పెట్టుబడి సాయం చేయ‌నున్నారు. 

 

వీటితో పాటు రైతులకు రసాయనిక ఎరువుల నుంచి విముక్తి, భూసార రక్షణకు అదనపు సాయం, సంస్కరణలు, రైతులకు సహాయంగా గోదాముల నిర్మాణం, గోదాముల నిర్మాణానికి నాబార్డు ద్వారా సాయం చేయ‌నున్న‌ట్టు  నిర్మలా సీతారామన్ ప్ర‌క‌టించారు. రైతుల కోసం ప్రత్యేకంగా విమాన సర్వీసుల్ని కూడా ప్రారంభిస్తామన్నారు. భారతీయ రైల్వే రైతుల కోసం కిసాన్ రైలు తయారు చేస్తుందన్నారు. 2022 లోగా ప్రభుత్వం రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేసేందుకు ప్రయత్నిస్తుందన్నారు.

 

రైతుల కోసం 16 యాక్షన్ పాయింట్స్ ఏర్పాటు చేశామన్నారు. దీంతో పాటు వ్యవసాయానికి, వ్యవసాయ సంబంధిత పథకాలకు రూ.2.83 లక్షల కోట్లు ఈ బడ్జెట్‌లో కేటాయింపులు చేశామన్నారు. అలాగే రానున్న ఆర్థిక సంవత్సరానికి వ్యవసాయ రుణాల లక్ష్యం రూ.15 లక్షల కోట్లు కేటాయింపులు చేశామన్నారు. అలాగే సీవీ కేజ్‌ కల్చర్‌ విధానంలో మత్స్య పరిశ్రమ అభివృద్ధికి ప్రోత్సాహకాలు అందిస్తున్నామన్నారు. 

 


 

మరింత సమాచారం తెలుసుకోండి: