కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్‌లో బడ్జెట్ పవేశ పెట్టారు. కేంద్ర పద్దులపై ఏపీ ప్రభుత్వం కోటి ఆశలు పెట్టుకుంది. గత ఐదేళ్లలో రాష్ట్రానికి ఆశించిన స్థాయిలో కేటాయింపులు జరగలేదు. నరేంద్రమోదీ సర్కార్ రెండోసారి అధికారం చేపట్టడం, రాష్ట్రంలో జగన్ ప్రభుత్వం ఏర్పడడంతో... ఈసారైనా రాష్ట్రానికి న్యాయం జరక్కపోతుందా అని ప్రజలు వేయికళ్లతో ఎదురు చూసారు. కేంద్ర బడ్జెట్ అనగానే ముందుగా గుర్తుకు వచ్చేది రాష్ట్రానికి ప్రత్యేక హోదా, విభజన హామీల అమలు. 

 

ప్రత్యేక హోదా అంశాన్ని కేంద్రం ఎప్పుడో అటక్కెక్కించేసింది. దాని స్థానంలో ప్రత్యేక ప్యాకేజీ అన్న అంశాన్ని తెరమీదకు తీసుకువచ్చింది. అలాగని ప్రత్యేక ప్యాకేజీ కూడా రాష్ట్రానికి ఆశించినంత అందలేదు. గడచిన ఐదేళ్లలో కేంద్రం రాజధాని నిర్మాణానికి కేవలం రూ. 15 వందల కోట్లు మాత్రమే ఇచ్చి చేతులు దులుపుకుంది. మరోవైపు పరిపాలనా రాజధానిగా విశాఖను చేసేందుకు జగన్ సర్కార్ అడుగులు ముందుకు వేస్తోంది. దీంతో రాజధాని నిర్మాణానికి నిధులపై కొంత సందిగ్ధం ఏర్పడింది. ఇక జాతీయ ప్రాజెక్ట్ అయిన పోలవరానికి కూడా కేంద్రం అనుకున్న స్థాయిలో నిధులు విడుదల చేయలేదు. 

 

పోలవరం ప్రాజెక్ట్‌కు సంబంధించి రాష్ట్రం ఖర్చు చేసిన 11 వేల 860 కోట్ల రూపాయలలో కేంద్రం నుండి 3 వేల 283  కోట్ల రూపాయలు రావాల్సి వుంది. ప్రాజక్ట్‌కు ఇంకా 24 వేల 489 కోట్ల రూపాయలు ఖర్చు చేయాల్సి ఉందని అధికారులు చెబుతున్నారు. కేంద్ర ప్రయోజిత పథకాల ద్వారా రావాల్సిన దాదాపు 6 వేల కోట్ల రూపాయలు కూడా ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం కోరుతోంది. అలాగే ఈసారి రైల్వే బడ్జెల్‌లో విశాఖ మెట్రో రైలుకు నిధులు కేటాయించాలని పట్టుబడుతోంది.

 

కేంద్ర బడ్జెట్‌లో దక్షిణాదికి ప్రతీసారి అన్యాయమే జరుగుతోందన్న భావన ఇక్కడి రాష్ట్రాల్లో చాలా బలంగా  ఉంది. ఇది ఎప్పుడూ జరిగే తతంగమే అయినప్పటికీ బడ్జెట్ కేటాయింపుల్లో వరుసగా అన్యాయానికి గురవుతున్న ఏపీని.. ఈ సారి ఎలాగైనా కేంద్రం పెద్ద మనసుతో ఆదుకోవాలని ఆంధ్రా ప్రజలు కోరుకున్నప్పటికిని అది జరగలేదు. అసలు తెలుగు రాష్ట్రాల ప్రస్తావనే సభలో రాలేదంటే అతిశయోక్తి కాదేమో. ఆఖరకు కేంద్ర బడ్జెట్‌ తెలుగు రాష్ట్రాలకు నిరాశే మిగిల్చింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: