మరో రెండేళ్ల వ్యవధిలో రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామని కేంద్ర ఆర్ధికమంత్రి నిర్మలాసీతారామన్ పేర్కొన్నారు . దేశం లోని 60 కోట్ల మంది జనాభా వ్యవసాయం, దాని అనుబంధ రంగాలపై ఆధారపడి జీవిస్తున్నారు . వ్యవసాయ ఆధారిత రంగాల వృద్ధి రేటు కేవలం 2.8 శాతంగా నమోదయినప్పుడు , రెండేళ్ల వ్యవధిలో నిజంగానే రైతుల ఆదాయం రెట్టింపు సాధ్యమేనా ? అన్న ప్రశ్న తలెత్తుతోంది . ప్రస్తుతం రైతుల ఆదాయం శూన్యం కావడంతో , కేంద్ర ఆర్ధికమంత్రి మరొక సున్నాను చేర్చనున్నారా ? అంటూ వ్యవసాయ రంగ నిపుణులు ఎద్దేవా చేస్తున్నారు . రైతుల ఆదాయాన్ని పెంచే దిశగా కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకూ పెద్దగా చర్యలు తీసుకున్న దాఖలాలు లేవని వారు   పేర్కొంటున్నారు .

 

గతంలో ఎరువులు , విత్తనాలకు సబ్సిడీ ఇవ్వగా , మోదీ ప్రభుత్వం ఆ మొత్తాన్ని నగదురూపం లో రైతుల ఖాతాలకు బదిలీ చేస్తోంది . అయితే నీతిఆయోగ్ జరిపిన ఒక సర్వే లో నగదుబదిలీ వల్ల  ఆమొత్తాన్ని తాము రోజువారీ అవసరాలకు వినియోగించుకుంటున్నామని, ఎరువులు , విత్తనాల కోసం తిరిగి అప్పు చేయాల్సిన దుస్థితి నెలకొంటుందని చెప్పారు . రైతుల ఆదాయం రెట్టింపు చేసేందుకు సేంద్రియ వ్యవసాయం , ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తామని కేంద్రం చెబుతోంది . అయితే సేంద్రియ వ్యవసాయం , ప్రకృతి వ్యవసాయం చేసేది ఎంతమంది అన్న ప్రశ్న తలెత్తుతోంది . ఎందుకంటే అధిక దిగుబడి లక్ష్యంగా రైతులు విరివిగా ఎరువుల వాడకాన్ని చేస్తున్నారు .

 

ఒకవేళ నిజంగానే రైతుల ఆదాయం రెట్టింపు చేయాలని  కేంద్ర ప్రభుత్వానికి  చిత్తశుద్ధి ఉంటే,  తొలుత స్వామినాథన్ కమిషన్ సిఫార్సులను అమలు చేయాలని వ్యవసాయ రంగ నిపుణులు సూచిస్తున్నారు .  అదేసమయం లో రైతాంగం పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించడంతో పాటు , మార్కెట్ కమిటీలకు అనుసంధానంగా శీతల గిడ్డంగులు , శీతల వాహనాలను అందుబాటులోకి తీసుకురావాలని పేర్కొంటున్నారు . 

మరింత సమాచారం తెలుసుకోండి: