బడ్జెట్‌ ప్రసంగం అనంతరం, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయి రెడ్డి గారు పార్లమెంట్‌ ఆవరణలో వైఎస్సార్‌ సీపీ ఎంపీలతో కలిసి మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. కేంద్ర బడ్జెట్‌ తమకు తీవ్ర నిరాశ, నిస్పృహ మిగిల్చింది అని  పేర్కొన్నారు. వ్యవసాయంపై ఆధారపడి ఉన్న ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి బడ్జెట్‌ నిరుపయోగమని ఆయన పెదవి విరిచారు. ‘ద్రవ్యోల్బణం పెరగడం మంచి పరిణామం కాదు. బడ్జెట్‌లో కొన్ని అనుకూల, ప్రతికూల అంశాలు ఉన్నాయి. డిపాజిటర్ల బీమ లక్ష నుంచి రూ.5 లక్షలకు పెంచడం మాత్రం  మంచి పరిణామమే అని అన్నారు.

 

వ్యవసాయ కేటాయింపుల్లో ఏపీకి రావాల్సిన వాటాను కచ్చితంగా ఇవ్వాలని, రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయాలని, పోలవరం ప్రాజెక్ట్‌ త్వరితగతిన నిధులు కేటాయించాలి అని ఈ సందర్భంగా పేర్కొన్నారు. అలాగే రాష్ట్రానికి, వెనుకబడిన జిల్లాలకు నిధులు కావాలని, నిధుల కేటాయింపుల్లో మాత్రం ఏపీకి కేంద్రం మొండి చేయి చూపి, తన పక్షపాత ధోరణి చూపించింది అని వాపోయారు. ఇక ఏపీలో వెనుకబడిన జిల్లాలకు నిధుల కేటాయింపులు లేవు. ఏపీకి ఒక్క రైల్వే ప్రాజెక్ట్‌ కూడా ఇవ్వలేదు అని అన్నారు.

 

ప్రత్యేక హోదాతో పాటు కీలక అంశాలను ప్రస్తావించలేదు. ఆన్‌లైన్‌లో విద్య పై  జీఎస్టీ 18% చాలా ఎక్కువ. మౌలిక వసతులకు బడ్జెట్ ఎలా సమకూరుస్తారనే దానిపై వివరణ ఇవ్వాలి. ఏపీకి ఒక కొత్త రైలు ప్రాజెక్టు కూడా ఇచ్చినట్లు మాకు సమాచారం లేదు. ఆంధ్రప్రదేశ్‌లో ఎయిర్ పోర్టులను అభివృద్ధికి సరిపడ నిధులు ఇవ్వాలి.’ అని విజయసాయి రెడ్డి వ్యాఖ్యానించారు. 

 

అయితే వ్యవసాయ రుణాల మాఫీని వీలైనంత వరకు తగ్గించే ప్రయత్నం జరుగుతన్నట్లు కనిపిస్తోందని చెప్పారు. ముఖ్యంగా ఏపీ వ్యవసాయ ఆధారిత రాష్ట్రం అని, ఇలాంటి చర్యల వల్ల రాష్ట్రానికి నష్టం జరుగుతుందని, అందువల్ల వాటిపై ఆలోచన చేయాల్సి ఉందని కేంద్రాన్ని కోరారు. ఇక ఎగుమతుల ప్రోత్సాహం కోసం ఆర్థిక సర్వేలో నెట్వర్క్ ఉత్పత్తులనే ప్రస్తావించారని, వాటితో పాటు సంప్రదాయ ఉత్పత్తులు.. కాఫీ, టీ, స్పైసెస్ వంటి వాటికి కూడా ప్రాధాన్యం ఇవ్వాలని ఈ సందర్భంగా మాట్లాడారు.

మరింత సమాచారం తెలుసుకోండి: