ఎలక్ట్రిక్​ వాహనాలు కొనాలంటే ఇక భారం తప్పదు. దిగుమతి చేసుకున్న ఈ వెహికిల్స్​ ఇక చౌకగా లభించడం కుదరదు. ‘మేక్ ఇన్ ఇండియా" చొరవలో  భాగంగా  స్థానిక ఉత్పత్తిని ప్రోత్సహించేందుకు వివిధ రకాల వాహనాలపై కస్టమ్స్ సుంకాన్ని పెంచుతున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ శనివారం పార్లమెంట్​లో ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ 2020, 21 ప్రసంగంలో ప్రకటించారు. పూర్తిగా నిర్మించిన యూనిట్ల (సీబీయూ) పై కస్టమ్స్ సుంకాన్ని 40 శాతానికి పెంచుతున్నట్టు వెల్లడించారు. ప్రస్తుతం 25 శాతం మాత్రమే. 2020 ఏప్రిల్ 1 నుంచి ఇవి అమల్లోకి రానున్నాయి. అయితే  ఈ మేరకు దేశీయ కంపెనీలకు కాస్త ఊరట లభించనుంది.  

 

ప్రయాణికుల సెమీ నాక్-డౌన్ (ఎస్‌కెడి) ప్యాసింజర్‌ వాహనాలపై కస్టమ్స్ సుంకాన్ని 15 శాతం నుంచి 30 శాతానికి పెంచాలని ఆర్థిక మంత్రి ప్రతిపాదించారు. అదేవిధంగా, ఎలక్ట్రిక్ బస్సులు, ట్రక్కులు, ద్విచక్ర వాహనాలపై 15 శాతం నుంచి 25 శాతానికి పెంచాలని ప్రభుత్వం ప్రతిపాదించింది. సంప్రదాయ వాణిజ్య వాహనాల  సీబీయూల కస్టమ్స్ సుంకాన్ని 30 శాతం నుంచి 40 శాతానికి పెంచాలని నిర్మలమ్మ ప్రతిపాదించారు. ఉత్ప్రేరక (కెటాలిక్‌) కన్వర్టర్లను తయారు చేయడానికి ఉపయోగించే భాగాలపై కస్టమ్స్ సుంకాన్ని 5 శాతం నుంచి 7.5 శాతానికి పెంచాలని ప్రభుత్వం ప్రతిపాదించింది. 

 

అంతేకాకుండా, ప్రయాణికుల ఈవీలు, త్రీ-వీలర్లు, ద్విచక్ర వాహనాలు, బస్సు మరియు ట్రక్కుల యొక్క పూర్తిగా నాక్-డౌన్ (సికెడి) రూపాలపై కస్టమ్స్ సుంకం ప్రస్తుత 10 శాతం నుంచి 15 శాతం వరకు పెంచాలని బడ్జెట్‌లో ప్రతిపాదించారు.  కాలుష్య ఉద్గారాలు అదుపులేని స్థాయికి పెరగడంతో గ్రీన్‌ మొబిలిటీపై  ప్రభుత్వం ఒత్తిడి చేయడంతో, వివిధ కార్ల తయారీదారులు కొన్నేళ్లుగా దేశంలో టాటా మోటార్స్, మహీంద్రా అండ్‌ మహీంద్రా, హ్యుందయ్ మోటార్, ఎంజీ మోటార్ ఇండియా కూడా ఎలక్ట్రిక్ మోడళ్లను ప్రవేశపెట్టాయి. అదేవిధంగా మెర్సిడెస్ బెంజ్, ఆడీ, జేఎల్‌ఆర్‌  లాంటి కంపెనీలు కూడా దేశంలో ఎలక్ట్రిక్ మోడళ్లను ప్రవేశపెట్టడానికి సన్నద్ధమవుతున్న సంగతి తెలిసిందే.  

మరింత సమాచారం తెలుసుకోండి: