2019 ఎన్నికల్లో రాష్ట్రమంతా వైసీపీ గాలి వీచినా..ఆ నియోజకవర్గంలో మాత్రం టీడీపీ హవా నడిచింది. జగన్‌ని కావాలని రాష్ట్ర ప్రజలు కోరుకున్న...ఆ నియోజకవర్గ ప్రజలు మళ్ళీ టీడీపీ ఎమ్మెల్యేనే గెలిపించారు. అది కూడా మంచి మెజారిటీతో గెలిపించారు. ఇంతకీ వైసీపీ గాలి వీయని నియోజకవర్గం ఏదో కాదు. విజయవాడ తూర్పు. ఇక్కడ రెండో సారి గద్దె రామ్మోహన్ అదిరిపోయే మెజారిటీతో గెలిచారు. నియోజకవర్గానికి పక్కనే ఉన్న వెస్ట్, సెంట్రల్ నియోజకవర్గాల్లో వైసీపీ అభ్యర్ధులు గెలిచినా..తూర్పులో మాత్రం వైసీపీ అభ్యర్ధి చతికలపడ్డారు.

 

గద్దెకు ఉన్న అనుకూలతలు కావొచ్చు...వైసీపీలో ఉన్న అసంతృప్తులు కావొచ్చు. మొత్తానికి ఇక్కడ టీడీపీ విజయం సాధించింది. అయితే గద్దె విజయానందాన్ని జగన్ ఎక్కువ కాలం ఉంచలేదు. నెలల కాలంలోనే ఆయనకు చెక్ పెట్టేలా విజయవాడపై పట్టున్న దేవినేని అవినాష్‌ని వైసీపీలోకి లాగేసుకున్నారు. అటు టీడీపీలో అన్యాయం జరుగుతుండటంతో అవినాష్ కూడా వైసీపీలోకి వచ్చేశారు. రావడం రావడమే ఎన్నికల్లో ఓడిపోయిన బొప్పన భవకుమార్‌కు వేరే పదవి ఇచ్చి....అవినాష్‌కు తూర్పు బాధ్యతలు అప్పగించారు.

 

ఎప్పుడైతే అవినాష్‌కు బాధ్యతలు వచ్చాయో...అప్పటి నుంచి నియోజకవర్గంలో లెక్కలు మారుతూ వస్తున్నాయి. అవినాష్ ప్రతిరోజూ నియోజకవర్గ ప్రజలతో మమేకమవుతున్నారు. సమస్యలు తెల్సుకుంటున్నారు. అధికార పార్టీలో ఉండటం వల్ల వారి సమస్యలని వెంటనే పరిష్కరిస్తున్నారు. ప్రతిరోజూ ఏదొక కార్యక్రమం ఏర్పాటు చేసి ప్రజలని కలుస్తున్నారు. అలాగే వారికి ఏమన్నా సాయం కావాలన్న వెంటనే చేస్తున్నారు. అందుకోసం సొంత డబ్బు కూడా ఖర్చు పెడుతున్నారు. అలాగే ఆరోగ్యం బాగోని పేదలకు సి‌ఎం రిలీఫ్ ఫండ్ కూడా అందేలా చేస్తున్నారు.

 

అటు ప్రభుత్వ పథకాల పట్ల ప్రజలకు అవగాహన కలిగిస్తున్నారు. పథకాల పట్ల ఏమన్నా అపోహలు ఉంటే, వాటి మీద సభలు ఏర్పాటు చేసి, వారి అపోహలని తొలగిస్తున్నారు. అలాగే పలు కార్యక్రమాల్లో పేద ప్రజలకు భోజనం కూడా పెడుతున్నారు. ఈ విధంగా పనిచేస్తూ.. తూర్పులో ప్రతి గడప తొక్కుతూ..ప్రజలని వైసీపీకి అనుకూలంగా మారేలా చేశారు. మొత్తానికి జగన్ తీసుకున్న ఒకే ఒక నిర్ణయంతో టీడీపీ కంచుకోట..వైసీపీకి ఫేవర్ అయిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: