ఈరోజు పార్లమెంట్ వేదికగా కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ వార్షిక బడ్జెట్ను ప్రవేశ పెట్టి చదివి వినిపించిన విషయం తెలిసిందే. అయితే కేంద్ర బడ్జెట్ పై ఎన్నో ఆశలతో ఉన్న తెలుగు రాష్ట్రాలకు ఈ బడ్జెట్లో నిరాశే ఎదురైంది అని చెప్పాలి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా సహా.. పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వలేదు కేంద్ర ప్రభుత్వం. సరైన హోదా ఇవ్వకుండా అతి తక్కువ మొత్తంలో నిధులు కేటాయించింది. కేంద్ర బడ్జెట్పై ఏపీ నేతలందరూ పెదవి విరుస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ పై మొండి వైఖరి అవలంభిస్తోందని అంటూ ఆరోపిస్తున్నారు. 

 

 

 ఈ క్రమంలోనే కేంద్ర బడ్జెట్ పై  ఎంపీ జీవీఎల్ నరసింహారావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రాల  అంశాల ప్రాతిపదికన కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ ను చూడొద్దని ఎంపీ జీవీఎల్ నరసింహారావు వ్యాఖ్యానించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా అనేది ఇప్పటికే ముగిసిన అధ్యాయం అంటూ గతంలో చెప్పామని తెలిపిన జీవీఎల్ నరసింహారావు... కాశ్మీర్ లడక్ లకు ఇచ్చినట్లుగానే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కూడా కేంద్ర బడ్జెట్లో స్పెషల్ ప్యాకేజీ ఇచ్చామని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న పోలవరం ప్రాజెక్టుకు కేంద్ర బడ్జెట్ కు ఎలాంటి సంబంధం లేదని ఆయన తేల్చి చెప్పారు. పోలవరం ప్రాజెక్టుకు నాబార్డు ద్వారా కేంద్రం నిధులను సమకూరుస్తుంది అని తెలిపిన ఎంపీ జీవీఎల్ నరసింహారావు... పోలవరం ప్రాజెక్టు ఖర్చులపై యూసి లు రావాల్సి ఉంది అంటూ తెలిపారు. 

 

 

 ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ కల్చర్ అండ్ హెరిటేజ్ అమరావతిలో ఏర్పాటు చేయాలని కేంద్ర మంత్రికి విజ్ఞప్తి చేస్తామంటూ ఎంపీ జీవీఎల్ నరసింహారావు తెలిపారు. అయితే కేంద్ర బడ్జెట్ పై  ఏపీ మంత్రులు మాత్రం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర బడ్జెట్ తో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నిరాశే ఎదురైంది అని ఆరోపిస్తున్నారు. విభజన హామీలను పెండింగ్లో పడడం రాష్ట్రానికి ఇబ్బందికర పరిస్థితి అంటూ  వ్యాఖ్యానిస్తున్నారు. ప్రత్యేక హోదా పై కేంద్రం బడ్జెట్ లో  ఎలాంటి హామీ ఇవ్వలేదు అంటూ ఆరోపిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: