ఇంటింటికీ ఫించను వాలంటీర్లు వెళ్లే కార్యక్రమానికి స్వీకారం చుట్టిన ఏపీ సీఎం జగన్.. ఆ సందర్భంగా పింఛను దారులందరికీ శుభాభినందనలు తెలిపారు. రాష్ట్రంలో అవ్వా తాతలు, పేదలు పడుతున్న ఆర్థిక ఇబ్బందులను ‘ప్రజా సంకల్పయాత్ర’లో చూసి నేను చలించిపోయానంటూ లేఖ ద్వారా పలకరించారు. ఆయన ఇంకా లేఖలో ఏం రాశారంటే..

 

మీరు సమాజంలో గౌరవప్రదమైన జీవనం సాగిస్తూ ఆర్థికంగా నిలదొక్కుకోవాలనే సదుద్దేశంతో నేను ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే నా తొలి సంతకం ‘నవరత్నాల’లో అత్యంత ప్రాధాన్యమైన వైఎస్సార్‌ పింఛను పథకంలో భాగంగా పింఛన్ల పెంపుతో పాటు వయో పరిమితిని 65 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాలకు తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నా.”

 

"అర్హులందరికీ సంతృప్త స్థాయిలో పింఛన్లు ఇవ్వాలన్న దృఢ నిశ్చయంతో పింఛన్ల అర్హతలను సరళతరం చేశాం. పింఛను మొత్తం రూ.2,000 నుంచి రూ. 3000 వరకు పెంచుకుంటూ పోతాం అని చెప్పాం. ఆ మేరకు నేను సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన రోజునే రూ.2,250కి పెంచుతూ తొలి సంతకం చేశాను. ఈ మేరకు ఇప్పుడు అవ్వాతాతలకు పింఛన్లు ఇస్తున్నాం. అర్హులైన అందరికీ పింఛన్లు ఇవ్వాలనే ఉద్దేశంతో ‘నవశకం’ కార్యక్రమం ద్వారా కొత్తగా 6.11 లక్షల మందిని అర్హులుగా గుర్తించాం. వారి కుటుంబాల్లో ఆనందం కలిగే విధంగా ఫిబ్రవరి నెల నుంచి పింఛన్లు మంజూరు చేశాం."

 

"ఎందరో వ్యాధిగ్రస్తులు మరియు దీర్ఘకాలిక వైద్య చికిత్స వల్ల జీవనోపాధి కోల్పోయిన వారికి మన ప్రభుత్వం పింఛన్ల రూపంలో ప్రతి నెల ఆర్థిక సహాయం చేయుటకు నిర్ణయించడమైనది. దీనిలో భాగంగా 11 రకాలైన దీర్ఘకాలిక వ్యాధులకు (తలసేమియా, సికిల్ సెల్, తీవ్ర హిమోఫీలియా వ్యాధిగ్రస్తులకు, ద్వైపాక్షిక బోధ వ్యాధి, పక్షవాతంతో చక్రాల కుర్చీ లేదా మంచానికే పరిమితమైన వారు, తీవ్రమైన కండరాల బలహీనత మరియు ప్రమాద బాధితులు, చక్రాల కుర్చీ లేదా మంచానికే పరిమితమైన వారు, దీర్ఘకాలిక మూత్రపిండాల వ్యాధిగ్రస్తులకు (డయాలసిస్ చేయించు కొనేవారు), లివర్, కిడ్నీ, గుండె మార్పిడి చేయించుకున్న వారు మరియు కుష్ఠువాధి (బహుళ వైకల్యం) వారికి కూడా ఫిబ్రవరి, 2020 నుండి పింఛను మొత్తం రూ. 5,000/- నుండి రూ. 10,000/- వరకు మంజూరు చేయడమైనది.”

ఇచ్చిన మాటకు కట్టుబడి అర్హులైనందరికీ పింఛన్లను నేరుగా వారి ఇంటి వద్దకే గ్రామ/వార్డు వాలంటీర్ల ద్వారా అందిస్తూ వారి జీవితాలలో ఆనందం, సంతోషం చూడాలన్నదే మా ప్రభుత్వ లక్ష్యం.

ఇట్లు..

మీ ఆత్మీయ
వై.యస్. జగన్ మోహన్ రెడ్డి.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి.

మరింత సమాచారం తెలుసుకోండి: