ఏపీలో ఫిబ్రవరి ఒకటిని పించన్ల పండుగ కార్యక్రమం నిర్వహించారు. వివిధ రంగాల పించన్లు అందుకుంటున్న వారి ఇళ్లకు వెళ్లి వాలంటీర్లు స్వయంగా పింఛన్ సొమ్ము అందించారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా మొదలుపెట్టిన 'ఇంటి వద్దకే పెన్షన్‌' కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా 13 జిల్లాల్లో శనివారం ఘనంగా ప్రారంభమైంది. రాష్ట్రవ్యాప్తంగా ఉ‍న్న వృద్ధాప్య, వికలాంగ, వితంతువులకు గ్రామ, వార్ఢు వలంటీర్లు వారి ఇంటి వద్దనే పెన్షన్‌లు అందజేస్తున్నారు.

 

 

గ్రామ, వార్డు వలంటీర్లు తమకు అందజేసిన స్మార్ట్‌ఫోన్ల ద్వారా లబ్ధిదారులకు పెన్షన్ల పంపిణీ నిర్వహిస్తున్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని అమలు చేస్తున్న వైఎస్సార్ పెన్షన్‌ కానుకలో దీని ద్వారా మరో విప్లవాత్మకమైన మార్పు వచ్చినట్టైంది. ఈ కానుకల పంపిణీలో వాలంటీర్లు చురుగ్గా పాల్గొన్నందుకు జగన్ తన ఆనందాన్ని ట్విట్టర్ ద్వారా పంచుకున్నారు. ఒకే పూటలో 54.65 లక్షల మందికి పెన్షన్లు అందజేసిన గ్రామ, వార్డు వలంటీర్లకు ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ అభినందనలు తెలిపారు. వలంటీర్లను అభినందిస్తూ సీఎం వైయస్‌ జగన్‌ ట్వీట్‌ చేశారు.

 

 

"పెన్షన్లను గడప వద్దకే చేర్చాలన్న సంకల్పాన్ని సాకారం చేసిన గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు, వలంటీర్లకు అభినందనలు. అవినీతి, వివక్ష లేకుండా 54.6 లక్షల మందికి ఇంటి వద్దే పెన్షన్లు ఇస్తుంటే వారి కళ్లలో కనిపించిన సంతోషం నా బాధ్యతను మరింతగా పెంచింది. దేవుడి దయ, ప్రజల దీవెనతోనే ఇది సాధ్యమైంది.

 

ఎన్నికలకు ముందు వచ్చే పెన్షన్‌ రూ. వెయ్యి కాకుండా ఇప్పుడు రూ.2,250 వచ్చింది. పెన్షన్‌ వయస్సు కూడా 65 సంవత్సరాల నుంచి 60కి తగ్గించాం. కొత్తగా 6.11 లక్షల పెన్షన్లు ఇస్తున్నాం. ఇంకా ఎవరైనా అర్హులు మిగిలిపోతే గ్రామ సచివాలయాల ద్వారా దరఖాస్తు చేసుకోండి, వెంటనే వాటిని పరిశీలించి మంజూరు చేస్తారు" అని సీఎం వైయస్‌ జగన్‌ ట్వీట్‌ చేశారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: