కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కొత్త ఆదాయ పన్ను విధానంతో అందరినీ కన్ ఫ్యూజ్ చేసేశారు. సరళీకరణ పేరుతో మరింత గందరగోళానికి తెరలేపారు. ఖర్చులు పెరిగిన నేపథ్యంలో రూ.10 లక్షల వరకు ఆదాయపు పన్ను మినహాయింపు ఈ సారి బడ్జెట్లో ఇస్తారని అందరూ ఆశించారు. ఆదాయపు పన్ను పై రెండేళ్లుగా రిబేటు ఇస్తుండటంతో రూ.5 లక్షల వరకు పన్ను భారం లేదు. ఈ పరిమితి దాటిన వారికి రిబేటు కూడా వర్తించదు.

 

 

అందుకే.. రూ.5 లక్షల పైన పన్ను వర్తించే ఆదాయం కలిగిన వారందరూ బడ్జెట్ పై చాలా ఆశలు పెట్టుకున్నారు. పన్ను మినహాయింపు పరిమితి పెంచుతారని ఊహించారు. అయితే నిర్మల కొత్త పన్ను శ్లాబులో గందరగోళపరిచారు. బడ్జెట్లో పన్ను భారం తగ్గిస్తూనే మెలిక పెట్టడంతో ఎక్కువ మంది ఉద్యోగులు పెదవి విరుస్తున్నారు. ఇప్పుడు ఐటీ రిటర్న్ దాఖలు చేయాలంటే ఇప్పుడు ఇస్తున్న కొని మినహాయింపులు వదులుకోవాలంటున్నారు.

 

పన్ను తగ్గించుకునేందుకైనా ఇది వరకు ఎక్కువ మంది వేర్వేరు మదుపు పథకాల్లో పెట్టుబడి పెట్టి మినహాయింపు క్లెయిం చేసుకునేవారు. గృహ రుణం తీసుకున్న వారికి రూ.2 లక్షల వరకు వడ్డీపై పన్ను నుంచి మినహాయించేవారు. ఇప్పుడు కూడా ఈ మినహాయింపులు ఉన్నా, పన్నుశాతం తగ్గించిన కొత్త శ్లాబ్ లోకి మారితే వర్తించవనే మెలిక పెట్టేసరికి ఉద్యోగస్తులు ఆవేదన చెందుతున్నారు.

 

ఈ బడ్జెట్ ధనవంతులకే తప్ప మధ్యతరగతి, ఉద్యోగులు, సీనియర్ సిటిజన్లకు ఏ మాత్రం ప్రయోజనకరంగా లేదంటున్నారు. ఆదాయ పన్ను శాతాలు తగ్గించినా.. మినహాయింపులు వర్తించదనే నిబంధనతో ఎవరికి ఉపయోగం లేకుండా పోయిందంటున్నారు. రూ.12.5 లక్షలకు పైగా వార్షికాదాయం ఉన్నవారికే ఈ నిబంధనతో మేలు జరుగుతోందని చెబుతున్నారు. ఈ కొత్త విధానంతో పన్నులు తగ్గించినట్టుగా కనిపిస్తున్నా.. చివరకు ఏమాత్రం లేకుండా పోతోందని విమర్శిస్తున్నారు చాలా మంది ఉద్యోగులు.

మరింత సమాచారం తెలుసుకోండి: